Trinethram News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు పూర్తైన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 20 వరకు జరిగిన ఈ పరీక్షలకు 9,99,698 మంది విద్యార్ధులు హాజరయ్యారు. 2023-24 విద్యాసంవత్సరానికి రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులతో కలిపి మొత్తం 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొదటి ఏడాది 5,17,617 మంది, రెండో ఏడాది 5,35,056 మంది విద్యార్ధులు ఉన్నారు. మొత్తం విద్యార్ధుల్లో పరీక్షలకు 52,900 మంది గైర్హాజరయ్యారు. ఈ ఏడాది జరిగిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో 75 మంది విద్యార్ధులు మాల్‌ప్రాక్టీస్‌కు యత్నించారు. వీరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక ఇప్పటికే ఇంటర్ సమాధాన పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఏప్రిల్ 4వ తేదీ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత వెనువెంటనే రెండో వారంలోనే ఫలితాలు విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం
కాగా ఈ ఏడాది జరిగిన ఇంటర్ వార్షిక పరీక్షలకు ఇంటర్ బోర్డు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం 1559 సెంటర్లలో ప్రతి గదిలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, పరీక్షల నిర్వహణ విధానంపై పటిష్ట నిఘా పెట్టారు. అందుకు గానూ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22 వేల కెమెరాలను వినియోగించారు. అన్ని పరీక్ష కేంద్రాల నుంచి మానిటరింగ్ చేసేందుకు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బోర్డు కార్యాలయం కేంద్రంగా పనిచేసింది. మరోవైపు పరీక్ష కేంద్రాల నుంచి పరీక్ష పత్రాలు లీక్ కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అందుకు టెక్నాలజీతో చెక్ పెట్టారు.ప్రశ్నపత్రాలకు మూడు స్థాయిల్లో ‘క్యూఆర్’ కోడ్‌ను జోడించి లీకేజీలను అరికట్టారు. అంతేకాకుండా ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియెట్ కమిషనరేట్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది.
ఫీజు చెల్లింపు, నామినల్ రోల్స్ నమోదు నుంచి ఎగ్జాం సెంటర్ల వరకు అన్ని దశల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని బోర్డు వినియోగించింది. గతంలో ఇంటర్ పరీక్ష ఫీజును చలాన్ రూపంలో విద్యార్ధులు చెల్లించేవారు. వాటిని పరిశీలించి మదింపు చేసేందుకు బోర్డుకు అత్యాధిక కాలయాపన పట్టేది. ఈ ఏడాది ఆన్లైన్ విధానం తీసుకురావడంతో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయినట్లైంది. ఇక ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షకు కూడా సాంకేతికతను వినియోగించారు. ప్రాక్టికల్స్ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే మార్కులను బోర్డు వెబ్సైట్లో నమోదు చేశారు. మార్కుల విషయంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఎగ్జామినర్ రెండుసార్లు ఆన్లైన్లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నారు.