TRINETHRAM NEWS

Trinethram News | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి కోర్టును ఆశ్రయించింది. సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది.
ఈ అంశంపై గురువారం కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉన్నది. గతంలోనూ ఈడీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటి వరకు ఈడీ ఎనిమిది సార్లు సమన్లు పంపగా.. విచారణకు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించగా.. గురువారం విచారణ కోసం ఏసీఎంఎం దివ్య మల్హోతా జాబితా చేశారు. అయితే, మూడుసార్లు నోటీసులు జారీ చేసినా హాజరుకాకపోవడంతో ఈడీ స్థానిక కోర్టును ఆశ్రయించింది.

ఈ కేసులో మార్చి 16న విచారణ జరుగనున్నది. ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణంలో విచారణకు కేజ్రీవాల్‌ అంగీకరించారు. మార్చి 12 తర్వాత కొత్త తేదిని ఇవ్వాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణకు హాజరుకానున్నట్లు తెలిపారు. మద్యం పాలసీ కేసులో గతేడాది నవంబర్‌ 2 నుంచి ఇప్పటి వరకు ఈడీ ఎనిమిదిసార్లు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం 2021-22 ఎక్సైజ్ పాలసీ కింద లైసెన్స్‌ల జారీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఎల్‌జీ వీకే సక్సేనా మద్యం పాలసీని రద్దు చేసి.. సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. ఇందులో ఈడీ మనీలాండరింగ్‌ ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది.