![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-20.36.02.jpeg)
త్రాగు నీటి సరఫరా పై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, ఫిబ్రవరి 06: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలను జిల్లాలో కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష త్రాగు నీటి సరఫరా పై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
మన జిల్లాలో మిషన్ భగీరథ గ్రిడ్, ఇంట్రా త్రాగు నీటి సరఫరా లో భాగంగా చేపట్టిన పనులు, ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతున్న ఆవాసాలు, వాటర్ సోర్స్, ఇబ్బందులు తదితర అంశాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రాబోయే వేసవి కాలంలో నీటి సరఫరా సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతాయి, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పై నివేదిక ముందుగానే అందించాలని కలెక్టర్ తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా వేసవి కాలంలో ప్రతి జన ఆవాసానికి పూర్తి స్థాయిలో త్రాగునీటి సరఫరా జరగాలని, దీనికి అనుబంధంగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ముందుగానే చెక్ చేసి పెట్టుకోవాలని అన్నారు.
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఇంట్రాలో లీకేజీ, మరమ్మత్తు వంటి పనులు ఏవైనా ఉంటే వెంటనే చేపట్టాలని అన్నారు. జిల్లాలో ఏదైనా ఆవాసాలకు గ్రిడ్ వాటర్ అందడం లేదా వంటి వివరాలను మండలాల వారీగా కలెక్టర్ తెలుసుకున్నారు.
నీటిపారుదల శాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ నీటి వనరుల ప్రాజెక్టు లలో త్రాగు నీరు సరఫరాకు వీలుగా వాటర్ లెవల్స్ మెయింటైన్ చేయాలని, దీనికి సంబంధించి సమాచారం ఎప్పటికప్పుడు తనకు అప్డేట్ చేస్తూ ఉండాలని అన్నారు. త్రాగు నీటి సరఫరా సంబంధించి లీకేజిలు, పంప్ మరమ్మత్తు ఏవైనా ఉంటే వెంటనే పూర్తి చేయాలని అన్నారు.
మిషన్ భగీరథ నిర్వహణకు సంబంధించి ఏవైనా పనులు చేపట్టాల్సి ఉంటే వెంటనే ప్రతిపాదించి ఈనెల 12 తారీఖు లోపు అందజేయాలని కలెక్టర్ తెలిపారు.
ప్రతి మండలంలో త్రాగునీటి సరఫరా ఏ ఆవాసాలకు ఇబ్బంది అవుతుంది వివరాలు తెలుసుకొని, అక్కడ చేపట్టాల్సిన చర్యల పై నివేదిక అందించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో త్రాగునీటి సరఫరా లీకేజీ లను ఎప్పటికప్పుడు అరి కట్టేలా చర్యలు తీసుకోవాలని, నీటి వృధాను నివారించాలని అన్నారు.
అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ సుల్తానాబాద్ మున్సిపాలిటీ పై సమీక్షిస్తూ పట్టణంలో పురోగతి లో ఉన్న 3 ఓవర్ హెడ్ ట్యాంకుల నుంచి నీళ్ళు తీసుకునేలా పనులను పూర్తి చేసి ఫిబ్రవరి 28 నాటికి వాటి నుంచి త్రాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఈ సమీక్షా సమావేశంలో ఈ ఇంట్రా గంగాధర శ్రీనివాస్ ,ఈ గ్రిడ్ పూర్ణచందర్ , డి. ఈ లు , ఏ. ఈ .లు ,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Collector](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-06-at-20.36.02-1024x526.jpeg)