TRINETHRAM NEWS

రాష్ట్రపతి పర్యటనలో అపశృతి.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో అపశృతి: హెలికాప్టర్ గాలికి ఎగిరిపడిన ఏసీపీ, పోలీసులు. పోచంపల్లి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. చేనేత కళాకారులు దేశ వారసత్వాన్ని కాపాడాలని, వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్నారు.
చేనేత కార్మికులు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పర్యటించారు.
పోచంపల్లిలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను, పోచంపల్లి టై అండ్‌ డై, ఇక్కత్‌ చీరల తయారీ, చేనేత మగ్గాలను, స్టాల్స్‌​ను, చేనేత ఔన్నత్యం ప్రతిబింబించే థీమ్‌ పెవిలియన్​ ను సందర్శించారు.
అనంతరం రాష్ట్రపతి మాట్లాడుతూ.. పోచంపల్లి చేనేత కళాకారులతో మాట్లాడం చాలా సంతోషంగా ఉందన్నారు. పోచంపల్లి వస్త్రాలకు మంచి గుర్తింపు ఉందన్నారు.
ఈ ప్రాంతానికి వచ్చి చీరలు నేసే విధానాన్ని చూడటం సంతోషంగా ఉందని రాష్ట్రపతి ముర్ము తెలిపారు. చేనేత కళను భావితరాలకు అందించడానికి కళాకారులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పోచంపల్లి కార్మికుల సమస్యలను, సలహాలను పరిగణలోకి తీసుకుని తన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
తమ ప్రాంతం నుంచి కొందరిని పోచంపల్లి తీసుకువచ్చి ఇక్కడ కళను వారికి నేర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
రాష్ట్రపతి పర్యటనలో ద్రౌపది ముర్ము పోచంపల్లి పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో గాలికి ఎగిరిపడ్డారు పోలీసులు.
ఈ ఘటనలో ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీకి చెయ్యి విరగగా, ఇద్దరు కానిస్టేబుళ్లకు స్వల్పగాయాలయ్యాయి. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.