TRINETHRAM NEWS

TTD: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. సర్వదర్శనం నిలిపివేత

తిరుమల: తిరుమలలో శ్రీవారి సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. శుక్రవారం టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను తితిదే అధికారులు క్యూలైన్లలోకి అనుమతించడం లేదు..

దీంతో ఏటీసీ వద్ద తితిదే విజిలెన్స్‌ సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. శనివారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణ గిరి షెడ్లు నిండిపోయి.. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూలైన్‌ చేరుకుంది. దీంతో వైకుంఠద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించి, టోకెన్లు లేని వారిని దర్శనానికి తితిదే అధికారులు నిరాకరించారు. రేపటి సర్వదర్శన టికెట్లు ఉన్న వారిని సాయంత్రం క్యూ లైన్లలోకి పంపిస్తామని తెలిపారు..

వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి అనుమతిస్తామని తితిదే తొలుత ప్రకటించింది. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో టోకెన్లు ఉన్నవారికే దర్శనానికి అనుమతించనున్నట్లు తెలిపింది. మరోవైపు శ్రీవారి వైకుంఠ ద్వార సర్వదర్శన టోకెన్లను తితిదే పంపిణీ చేస్తోంది. భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో రాత్రి నుంచే టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టింది. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల కోసం టికెట్లను ప్రత్యేక రంగుల్లో ముద్రించారు. ఇప్పటికే రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది..