పిఠాపురంలో మినీ గోకులాలు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
• రైతు యాతం నాగేశ్వరరావుకి గోవులు అందజేత
• రాష్ట్రవ్యాప్తంగా 12,500 గోకులాలకు లాంఛనంగా ప్రారంభోత్సవం
• మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో అతి తక్కువ సమయంలో గోకులాల నిర్మాణం
Trinethram News : Andhra Pradesh : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం, కుమారపురంలో మినీ గోకులాన్ని ప్రాంభించారు. కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన ఈ గోకులాన్ని ప్రారంభించి రైతు యాతం నాగేశ్వరరావుకి అందజేశారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో రూ. 1.85 లక్షల వ్యయంతో దీన్ని నిర్మించారు. మినీ గోకులాన్ని ప్రారంభించి నాలుగు గోవులను రైతుకి అందజేశారు. ఇదే వేదిక నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను లాంఛనంగా ప్రారంభించారు.
అతి తక్కువ సమయంలో భారీ సంఖ్యలో గోకులాల నిర్మాణం పూర్తి చేసి రికార్డు సృష్టించారు. కొబ్బరికాయ కొట్టి శాస్త్రోక్తంగా కుమారపురం మినీ గోకులాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గోమాతను పూజించి, పశుగ్రాసాన్ని అందించారు. అనంతరం గోకులం నిర్మాణ శైలిని పరిశీలించారు. గోకులం షెడ్లలో ఏర్పాటు చేస్తున్న మౌలిక వసతులను పశుసంవర్ధక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు అందిస్తున్న సదుపాయాలపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. పశువులకు అందిస్తున్న దాణా, అందుబాటులో ఉన్న పశుగ్రాసం వంగడాలు, పశుగణాభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను ఈ చిత్ర ప్రదర్శన ద్వారా క్షుణ్నంగా అధ్యయనం చేశారు.
పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఇప్పటి వరకు పూర్తి చేసిన అభివృద్ధి పనుల వివరాలతో కూడిన పోస్టర్ ను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ , పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంత్ పాటిల్, పౌరసరఫరాల కార్పోరేషన్ ఛైర్మన్ తోట సుధీర్, ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ కుమార్, కౌడా ఛైర్మన్ తుమ్మల రామస్వామి, పిఠాపురం నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ ఇంఛార్జులు మర్రెడ్డి శ్రీనివాస్, ఎస్వీఎస్ఎన్ వర్మ, కృష్ణంరాజు ఇతర ఉన్నతాధికారులు, నాయకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App