TRINETHRAM NEWS

“క్రిప్టో కరెన్సీ స్కాం.. రిమోట్ యాక్సెస్ ఫ్రాడ్” అంటూ సరి కొత్త ఎత్తుగడతో ప్రజలను దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు

ఫేక్ మొబైల్ యాప్ లను ఇన్ స్టాల్ చేయకండి.

ప్రామాణికమైన రిమోట్ స్క్రీన్ షేరింగ్ యాప్ లను మాత్రమే ఉపయోగించాలి.

స్నేహితుల వాట్సాప్ డీపీ లను చూసి వెంటనే స్పందించకండి.. నిర్ధారణ చేసుకుని సహాయం చేయండి.

ఊరకనే ఎవరికి ఏమీ రాదు అని గ్రహించి అప్రమత్తంగా ఉండండి.

సైబర్ నేరాల బారిన పడకండి మీ తోటి వారిని పడనీయకండి.

జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.

క్రిప్టో కరెన్సీ స్కామ్స్ తో జాగ్రత్త:-

క్రిప్టో కరెన్సీ స్కామ్స్ చేసే సైబర్ నేరగాళ్లు సృష్టించిన ఫేక్ మొబైల్ యాప్ లను డౌన్లోడ్ చేస్తే సదరు మొబైల్ మన ప్రమేయం లేకుండా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. ఈ విధంగా తన మొబైల్ లోని మొత్తం సమాచారాన్ని (ఫోటోలు, వీడియోలు, కాంటాక్ట్ లు, బ్యాంకు సంబంధిత వివరాలు) నేరగాళ్లు సేకరించి తనను, తన తోటి వారిని వేధింపులకు గురిచేసి డబ్బులను దోచుకుంటారన్నారు.

మొదటగా నకిలీ వెబ్ సైట్ ల లింకులు మీ ఇమెయిల్, వాట్సాప్ కి సైబర్ నేరగాళ్లు పంపుతారు. వాటిని ఓపెన్ చేస్తే ఆన్లైన్ పేమెంట్ చేయాలి అంటూ మరికొన్ని లింకులను పంపుతూనే ఉంటారు. సైబర్ నేరగాళ్లు పంపే నకిలీ వెబ్ సైట్ లింకులు చూడటానికి సమాజంలో ప్రముఖ కంపెనీల లోగోలు, పేర్లు మాదిరిగానే ఉంటాయి. కానీ ఒక అక్షరం తప్పు గా లేదా స్పెల్లింగ్ లో అక్షరాల క్రమం తారుమారుగా ఉంటుంది. కావున ప్రజలు ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకొని వెంటనే అప్రమత్తమై సైబర్ నేరగాళ్లకు ఎలాంటి సమాచారాన్ని ఇవ్వకుండా జాగ్రత్త పడాలని ఎస్పీ అన్నారు.

క్రెడిట్ కార్డు ఆఫర్లతో జాగ్రత్త:-

సాధారణంగా చాలామంది ప్రజలకు తమ క్రెడిట్ కార్డు బ్లాక్ అయింది అని లేదా క్రెడిట్ కార్డు లిమిట్ డబుల్ చేస్తాం అని కాల్స్ వస్తూ ఉంటాయి. అలాంటి కాల్స్ ను నమ్మి స్పందించకూడదు..అది సైబర్ నేరగాళ్లు వేసే ఎత్తుగడ అని ప్రజలు అప్రమత్తం కావాలి. పొరపాటున కూడా ఇటువంటి అనుమానాస్పద కాల్స్, ఈ-మెయిల్స్, మెసేజ్లను నమ్మి ప్రజలు తమ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలు మరియు ఓటిపి లను సైబర్ నేరగాళ్లకు తెలియజేస్తే వెంటనే మీ బ్యాంక్ అకౌంట్ లోని నగదు మాయం అవుతుందని తెలిపారు.

రిమోట్ యాక్సెస్ ఫ్రాడ్:-

రిమోట్ స్క్రీన్ షేరింగ్ ఆప్స్ పట్ల జాగ్రత్త వహించాలి. సైబర్ నేరగాళ్లు ఇలాంటి యాప్ లను కూడా ఉపయోగించి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే అవకాశం ఎక్కువగా ఉన్నది. కావున ప్రభుత్వం వారు నిర్దేశించిన రిమోట్ స్క్రీన్ షేరింగ్ యాప్ లను మాత్రమే ఉపయోగించి సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్త వహించాలన్నారు.

వాట్సప్ డిపి స్కామ్ తో జాగ్రత్త:-

సైబర్ నేరగాళ్లు మన స్నేహితుల ఫోటోలు వాట్సప్ డిపి గా పెట్టి మనల్ని ఆర్థిక సహాయం అడగవచ్చు. అలాంటి మెసేజ్లను నమ్మి వెంటనే సహాయం చేయకండని, సహాయం చేసే ముందు ఒకసారి సదరు స్నేహితుని ద్వారా నిర్ధారించుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. ఇటీవల కాలంలో తరచుగా జరుగుతున్న సైబర్ నేరాలలో ఇది ప్రముఖమైనదన్నారు. సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.

ప్రజలకు తిరుపతి జిల్లా పోలీసు వారి సూచనలు:-

క్రిప్టో కరెన్సీలో ఎలా డబ్బులు సంపాదించాలో టిప్స్ చెప్తామంటూ వచ్చే లింక్స్ ను నమ్మకండి.

చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ లను ఇవ్వకండి, వారికి దూరంగా ఉంచండి.

అనవసరంగా మొబైల్ నందు యాప్ లను ఇన్స్టాల్ చేయకండి.

సైబర్ క్రైమ్ బారిన పడిన ప్రజలు ఎవరైనా మానసికంగా మదన పడకుండా నిర్భయంగా తిరుపతి సైబర్ క్రైమ్ పోలీసు వారికి నేరుగా ఫిర్యాదు చేయవచ్చును లేదా 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చును లేదా NCRP Portal (https://www.cybercrime.gov.in/) నందు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ఐపీఎస్. ప్రజలకు సూచించారు.