TRINETHRAM NEWS

శివ శంకర్. చలువాది

నార్కట్ పల్లి – అద్దంకి బైపాస్ రోడ్డు వారికి టార్గెట్…

నల్గొండకు చెందిన కుంచం చందు, ప్రశాంత్‌, రాజు, చింతా నాగరాజు, అన్నెపూరి లక్ష్మణ్‌, శివరాత్రి ముకేష్‌, మైనర్ బాలుడు జులాయిగా తిరిగేవారు.

ఈజీ మనీ కోసం అలవాటు పడిన వీరంతా ఓ ముఠాగా ఏర్పడ్డారు.

నల్లగొండ పట్టణంలోని అద్దంకి బైపాస్ రోడ్డుతో పాటు పానగల్ చెరువుకట్ట, అనిశెట్టి దుప్పలపల్లి రోడ్డు ప్రాంతాల్లోని చెట్ల పొదల చాటున ప్రేమికులు ఏకాంతంగా ఉన్న సమయంలో వారిని ఈ ముఠా టార్గెట్‌ చేస్తుంది.

రహస్యంగా వీడియోలు తీసి..లీక్‌ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతోంది.

ముఠా సభ్యులంతా గంజాయి మత్తులోనే దాడులకు పాల్పడేది.

ముఠా సభ్యులు ఒకరి తర్వాత ఒకరు మహిళలు, యువతులపై బలవంతంగా లైంగిక దాడులు చేస్తూ సెల్‌ఫోన్లలో వీడియోలు తీసి వికృత చేష్టలకు పాల్పడేవారు.

ఈ ముఠా పలువురిని బెదిరించి డబ్బు, నగలు, విలువైన వస్తువులు దోచుకునేది. జరిగిన విషయాన్ని బాధితులు బయటకు చెప్పుకోలేక మిన్నకుండిపోయారు.

కొన్ని రోజులుగా ఈ ముఠా ఆగడాలు పెరిగిపోయాయి. ఏడాది క్రితం తిప్పర్తికి చెందిన భార్యభర్తలు నల్లగొండలో పనులు ముగించుకుని పానగల్ బైపాస్ మీదుగా స్వగ్రామానికి వెళ్లే క్రమంలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు రోడ్డు కిందకు వెళ్లారు. ఈ క్రమంలో భర్త ముందే భార్యపై దాడి చేసి బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఇద్దరు పిల్లలు గట్టిగా అరవడంతో పాటు భర్త ఎదిరించగా అతనిపై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. చాలా మంది బాధితులు పోలీసు అధికారులకు ఫోన్ లో సమాచారం ఇవ్వడంతో పాటు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. నార్కట్ పల్లి – అద్దంకి బైపాస్ రోడ్డులోని నంద్యాల నర్సింహారెడ్డి కాలనీలో ఏడుగురు సభ్యులు గల ముఠాను విచారించగా ప్రేమ జంటలు, మహిళలపై లైంగిక దాడులు, దోపిడీలు చేసినట్లు అంగీకరించింది.

పట్టుబడిన వారంతా, బాధితులను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఒక యాప్ ను రూపొందించి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా ఫోన్ కాల్ డేటా ఆధారంగా గుర్తించారు. ఈ ముఠా సభ్యులు మూడేళ్లుగా అకృత్యాలకు పాల్పడిందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి వివరించారు. నిందితుల్లో ఒకరు మైనర్ బాలుడని చెప్పారు. వీరిని అరెస్ట్ చేశామని, నిందితుల నుంచి బంగారు ఉంగరాలు, సెల్‌ఫోన్లు, ఖరీదైన వాచీలు, రెండు టీవీలు, డ్రిల్లింగ్‌ యంత్రం, ఇన్వర్టర్‌ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఈలాంటి ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.