TRINETHRAM NEWS

దిస్పుర్‌: తాను భయపడనని, ప్రపంచమంతా వ్యతిరేకంగా నిలబడినా సత్యం కోసం పోరాడతానని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. అస్సాంలో ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ’కు ఆటంకాలు ఏర్పడుతోన్న నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు. తమకు పబ్లిసిటీ కల్పిస్తున్నందున.. యాత్రకు భాజపా అడ్డంకులు సృష్టించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. న్యాయ యాత్రను గువాహటి నగరంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడంతోపాటు రాహుల్‌పై కేసు నమోదు చేయాలని సీఎం హిమంత బిశ్వ శర్మ పోలీసులను ఆదేశించిన వేళ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘గతంలో కన్యాకుమారి నుంచి యాత్ర మొదలుపెట్టిన సమయంలో.. ప్రజలపై దాని ప్రభావం లేదని భాజపా నేతలు వాదించారు. కానీ, జమ్మూ-కశ్మీర్‌ చేరేనాటికి పరిస్థితులు మారిపోయాయి. దీంతో ఇప్పుడు మొదట్లోనే అడ్డుకోవాలనేది వారి ఆలోచన. కానీ, ఇలా చేయడం ద్వారా మాకే మేలు కలుగుతుంది. కాబట్టి.. యాత్రకు ఆటంకం కలిగించాలని నేనూ కోరుకుంటున్నా. తద్వారా దేశమంతా గమనిస్తుంది. అస్సాం సీఎం, కేంద్ర హోంమంత్రి చేస్తున్న పనుల వల్ల కాంగ్రెస్‌కు లబ్ధి చేకూరుతోంది. రాష్ట్రంలో ‘జోడో యాత్ర’ ప్రధాన అంశంగా మారింది. ఈ విషయంలో సంతోషంగా ఉన్నాను’’ అని రాహుల్‌ పేర్కొన్నారు.
‘భాగస్వామ్యం, యువత, కార్మికులు, మహిళలు, రైతులకు న్యాయం’ అనేవి కాంగ్రెస్‌ న్యాయ పోరాటంలో ఐదు స్తంభాలని పేర్కొన్నారు. వీటి విషయంలో తమ పార్టీ మరో నెలన్నరలో ప్రత్యేక కార్యక్రమాన్ని ముందుకు తెస్తుందని చెప్పారు.