TRINETHRAM NEWS

లోక్‌సభలో గందరగోళం.. సభ రేపటికి వాయిదా..!!

Trinethram News : నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు జరిగాయి. తొలిరోజు సంభాల్ హింసాత్మక ఘటనపై, భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై చర్చించేందుకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసు ఇచ్చాయి.

విపక్షాల ఆందోళనతో సభా కార్యక్రమాలు కొనసాగలేదు. రెండవ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, పార్లమెంటులోని చారిత్రక సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఇక నేడు మూడో రోజు బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లు 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. నేటి ఎజెండాలో రైల్వేస్ (సవరణ) బిల్లు 2024ను చర్చ, ఆమోదం కోసం సమర్పించడం ఉంది. వీటితోపాటు ఇండియన్ ఎయిర్‌క్రాఫ్ట్ బిల్లు ఆమోదం కోసం రాజ్యసభలో ప్రవేశపెట్టబడుతుంది. చమురు రంగం (నియంత్రణ & అభివృద్ధి) సవరణ బిల్లు 2024 కూడా నేడు ఎగువ సభలో చర్చకు రానుంది.

ఈ నేపథ్యంలో లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు వెల్‌లోకి వచ్చి గందరగోళం సృష్టించారు. అదానీ అంశంపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యులు నినాదాలు చేసారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను నిర్వహించడానికి అనుమతించాలని విపక్ష ఎంపీలకు విజ్ఞప్తి చేసారు. అయినా కానీ లోక్‌సభలో విపక్షాల గందరగోళం కారణంగా సభా కార్యక్రమాలు కొనసాగలేదు. ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే, యూపీలోని మీరట్‌కు చెందిన బీజేపీ ఎంపీ అరుణ్ గోవిల్ OTT ప్లాట్‌ఫారమ్ ద్వారా అసభ్యకర కంటెంట్‌ను లేవనెత్తుతూ ఒక ప్రశ్న అడిగారు. ఇంతలో విపక్ష సభ్యులు వెల్‌లోకి దిగి రచ్చ సృష్టించారు. అదానీని మోడీ కాపాడుతున్నాడంటూ విపక్షాల ఎంపిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తడంతో రెండు సభల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. దింతో లోక్‌సభ అలా ప్రారంభమై.. ఇలా వాయిదా పడినట్లయింది.

స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేసినా ప్రతిపక్ష సభ్యులపై ప్రభావం చూపలేదు. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ కార్యకలాపాలను కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. అదానీ గ్రూప్‌కు సంబంధించిన కేసును దర్యాప్తు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని, రూల్ 267 కింద దానిపై చర్చ జరపాలని కోరుతూ ఇచ్చిన నోటీసును అనుమతించేందుకు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ సభా కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత నిరాకరించారు. దీంతో విపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. గందరగోళం మధ్య సభా కార్యక్రమాలను చైర్మన్ ఉదయం 11.30 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత 11.30 గంటలకు సభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు మళ్లీ గందరగోళం సృష్టించారు. దాంతో సభా కార్యక్రమాలను చైర్మన్ నవంబర్ 28వ తేదీ ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App