రజకులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
23వ డివిజన్లో బల్లల పండుగకు హాజరు, రాజమహేంద్రవరం : అభివృద్ధికి తమ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 23వ డివిజన్ రామాలయం వద్ద జరిగిన బల్లల పండుగ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గంగమ్మ తల్లి ప్రతిమకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మన ప్రాచీన సంస్కృతులను కాపాడు కోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో రజకుల సంక్షేమం, అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఆదరణ పథకం ద్వారా పనిముట్లు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. వైకాపా వాటిని తుంగలో తొక్కి రజకులను నిర్లక్ష్యం చేసిందన్నారు. బల్లల పండుగ నేపథ్యంలో తమకు అన్నం పెట్టే ఆ బండకు జనవరి నెలలో 15 రోజుల పాటు పూజలు చేస్తారని, దీనినే బల్లల పండగ అని అంటారన్నారు.
ఈ పండగ జరిగే రోజుల్లో రజకులు ఏ ఇతర పనులు చేయరని, అయితే ప్రస్తుత జీవన విధానంలో ఎన్నో వైవిద్యమైన మార్పులు చోటుచేసుకున్నాయని, ఎవరికివారు తమ జీవనోపాధి కోసం ఉద్యోగ వ్యాపార రీత్యా ఆయా ప్రాంతాలకు వలసలు వెళ్లి జీవనం సాగిస్తుంటే మరికొందరు అనాదిగా వస్తున్న కులవృత్తులు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రాచీన కాలంలో కుమ్మరులు కుండలు, మేదరులు బుట్టలు, రజకలు బట్టలు ఉతుకుతూ, విశ్వబ్రాహ్మణులు కమ్మరి కొలుములలో పనిముట్లు చేస్తూ, గిరిజనులు వేటాడుతూ, బ్రాహ్మణులు పౌరోహిత్యం ఇలా ఎవరి కులవృత్తిని వారు చేస్తూ జీవనం సాగించేవారన్నారు. కానీ రాను రాను పోటీ ప్రపంచంలో పల్లెల్లో కులవృత్తులు చాలాచోట్ల కనుమరుగయ్యి ఉపాధి కోసం వారు పట్టణాల బాట పడుతున్నారని పేర్కొన్నారు.
అయితే కుల వృత్తుల మీద గౌరవం ఉన్న కొందరు ఇప్పటికీ వారి కులాలకు చెందిన సాంప్రదాయ పండుగలను నిర్వహిస్తూ తమ భవిష్యత్ తరాలకు తమ పూర్వీకుల విశిష్టతలు, వృత్తులు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారని, ఈ క్రమంలోనే రజకులు బల్లల పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. ప్రాచీన కాలంలో రజకుల కులవృత్తి బట్టలు ఉతకడం, నదులు, చెరువులు, కాలువలు వద్ద పెద్ద పెద్ద బండలు ఏర్పాటు చేసి వాటిపై బట్టలు ఉతికేవారని, అయితే తమకు అన్నం పెట్టే ఆ బండకు ఏడాదికి ఒకసారి జనవరి నెలలో 15 రోజుల పాటు పూజలు చేస్తారని, దీనినే బల్లల పండుగ అంటారని పేర్కొన్నారు. పండుగ జరిగే 15 రోజుల్లో ఒక ఆదివారాన్ని ఎంచుకొని అక్కడ బట్టలు ఉతికే బల్లలు పెట్టీ గంగమ్మ తల్లికి పూజలు చేస్తారని, ఎందుకంటే నీళ్లలో ఉన్న బండ వద్ద బట్టలు ఉతికే సమయంలో ఎటువంటి విషపురుగులు, పాములు, ఇతరత్రా కీటకాల నుంచి తమకు హాని కలగకుండా కాపాడిన గంగమ్మకు మొక్కులు తీర్చుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రజకులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App