TRINETHRAM NEWS

CM Chandrababu Naidu in review of power department

రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందాలి

నాణ్యమైన విద్యుత్ అందించేందుకు ఫీడర్ల సామర్థ్యం పెంపుతో పాటు ప్రత్యేక ఫీడర్లు ఏర్పాటు చేయాలి

సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలి

విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు

Trinethram News : అమరావతి :- రాష్ట్ర రైతాంగానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధన శాఖ అధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆయా ఫీడర్ల సామర్ధ్యాన్ని మెరుగు పరచడంతో పాటు ప్రత్యేక ఫీడర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. డిమాండుకు తగ్గ విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి వంటి పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సీఎం విద్యుత్ శాఖపై శుక్రవారం సమీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉందని, ఆ దిశగా ప్రణాళికలతో రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ను అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందించే వివిధ రకాల సబ్సిడీలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, యూనిట్ విద్యుత్ తయారీకి అవుతున్న వ్యయం, లోటును భర్తీ చేసేందుకు ఇతర గ్రిడ్ల నుండి కొనుగోలు చేస్తున్నవిద్యుత్ కు అవుతున్న వ్యయం తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. అదే విధంగా థర్మల్, జల విద్యుత్, సోలార్, విండ్ వంటి విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు, త్వరలో అందుబాటులోకి రానున్న విద్యుత్ ప్రాజెక్టుల పరిస్థితులపైనా సమీక్షించారు.

బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ విధానంపై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. అంతకు ముందు రాష్ట్ర ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి పరిస్థితులను సీఎంకు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖామంత్రి గొట్టిపాటి రవి కుమార్, సీఎం కార్యదర్శి ఏ.వీ రాజమౌళి, ఏపీ జెన్.కో ఎండీ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్ కో జెఎండీకీర్తి, ఆర్ధికశాఖ అదనపు కార్యదర్శి జె.నివాస్, కెపిఎంజి ప్రతినిధి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CM Chandrababu Naidu in review of power department