TRINETHRAM NEWS

అయోధ్య ఆలయానికి చేరుకున్న ‘ బాల రాముడు ‘

న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం లో ప్రతిష్ఠించనున్న బాల రాముడు విగ్రహం బుధవారంనాడు ఆలయ ప్రాంగణానికి ట్రక్కులో చేరుకుంది. దీంతో ”జై శ్రీరామ్” నినాదాలు మిన్నంటాయి.

గురువారం ఆలయ గుర్భగుడిలో బాల రాముడు ను ఉంచుతారని, శాస్త్రోక్తంగా పవిత్ర స్నానాలు, పూజాదికాలులతో పాటు ప్రతిష్ఠాపన ముందు జరగాల్సిన కార్యక్రమాలన్నింటినీ ఈనెల 21వ తేదీ వరకూ నిర్వహించి, 22వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రాణప్రతిష్ట జరుగుతుందని ఆలయ ట్రస్టు సభ్యులు తెలిపారు.

కాగా, ప్రాణప్రతిష్ఠ ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాడు ‘కలశ పూజ’ నిర్వహించారు. శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా, ఆయన భార్య, తదితరులు సరయు నది ఒడ్డున కలశ పూజ జరిపారు.

పూజానంతరం సరయు నదీజలాలతో కలశాలను రామ్ టెంపుల్ కాంప్లెక్‌కు తీసుకు వచ్చారు. ఈ కలశ జలాలతో బాల రాముడు విగ్రహానికి పవిత్ర స్నానం జరిపించనున్నట్టు అనిల్ మిశ్రా తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమాలను 121 మంది అర్చకులు నిర్వహిస్తుండగా, అనుష్టాన్‌కు సంబంధించిన విధివిధానాలను జ్ఞానేశ్వర్ శాస్త్రి నిర్దేశిస్తూ, సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.