Chief Minister Revanth Reddy in a spirited meeting with teachers
టీచర్ల చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు
-గవర్నమెంట్ స్కూల్లంటే గర్వపడేలా పనిచేయాలి
-ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ భవిష్యత్తు ప్రభుత్వ టీచర్ల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సమున్నతంగా తీర్చిదిద్దాలని ప్రజాప్రభుత్వం సంకల్పం తీసుకుందని, విద్యా వ్యవస్థలో మార్పు అనే యజ్ఞానికి ఉపాధ్యాయులంతా సహకరిస్తారనే విశ్వాసం తనకుందని సీఎం చెప్పారు.
దశాబ్దాల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35వేల మంది టీచర్లకు ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా టీచర్లతో ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ప్రజాప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఈ ఏడాది మొత్తం బడ్జెట్ లో 7.3 శాతం, అంటే సుమారు 21 వేల కోట్ల రూపాయలను విద్యా శాఖకు కేటాయించామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
ప్రభుత్వ రంగంలో 30వేల స్కూళ్లకుగానూ 26 లక్షల మంది విద్యార్థులుంటే, ప్రైవేటు రంగంలో మాత్రం 10వేల స్కూళ్లలోనే ఏకంగా 33 లక్షల మంది విద్యార్థులు ఉండటంపై ఉపాధ్యాయులు ఆలోచన చేయాలని, లోపాలను సరిదిద్దుకుంటూ ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసుకునే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని, అందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి ఎల్లప్పుడూ ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.
రైతులు, పేద కుటుంబాలకు ఇస్తున్నట్లే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత కరెంటు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే స్కూళ్లలో పారిశుధ్య నిర్వహణ బాధ్యతను కూడా మహిళా సంఘాలకు అప్పగించి, ఏటా రూ.79కోట్ల నిధులను కూడా కేటాయించినట్లు గుర్తుచేశారు.
తులసివనం లాంటి తెలంగాణలో గంజాయి మెక్కలను పీకేసే పని పాఠశాలల్లోనూ జరగాలని టీచర్లకు ముఖ్యమంత్రి సూచించారు. విద్యార్థులు పక్కదారులు పట్టకుండా చదువులతోపాటు స్పోర్ట్స్ యాక్టివిటీలను పెంచేలా ప్రణాళికలు రూపొందించామని, నైపుణ్యం పెంచడానికి స్కిల్ యూనివర్సిటీని కూడా ఏర్పాటుచేస్తున్నామని సీఎం తెలిపారు. గవర్నమెంట్ బడికి పోవడానికి గర్వపడేలా పరిస్థితులను తీసుకురావాలని టీచర్లకు ముఖ్యమంత్రి నిర్దేశం చేశారు.
టీచర్లతో ముఖ్యమంత్రి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రొఫెసర్ కోదండరాం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ సలహాదారులు, అధికారులు పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App