Trinethram News : దాచేపల్లి: రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన ‘రా..
కదలిరా’ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తెదేపాలో చేరారు. ఆయనకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పల్నాడు జిల్లాలో తలపెట్టిన వాటర్‌గ్రిడ్, వరికిపుడిసెల ఎత్తిపోతలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అభివృద్ధికి తమ వెంట నడవాలని కోరారు.
”కార్యకర్తలను కాపాడుకునేందుకు యరపతినేని ఎన్నో త్యాగాలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఓటు వేయాలి. వైకాపా ప్రభుత్వం పనైపోయిందని పోలీసులు కూడా గ్రహించాలి. హూ కిల్డ్ బాబాయ్.. జగన్ ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. బాబాయ్‌ను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలి. హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికిరారని, ఎంతో బాధతో అన్న పార్టీకి ఓటు వేయొద్దని మీ చెల్లే చెప్పింది. సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి.. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా? టిష్యూ పేపర్లా వాడుకుంటారు.. జగన్‌ది యూజ్ అండ్ త్రో విధానం. మరో 40 రోజుల్లో జగన్‌ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారు. బెంగళూరు, ఇడుపులపాయ, కడప, హైదరాబాద్, తాడేపల్లిలో జగన్‌కు ప్యాలెస్‌లు ఉన్నాయి. అవన్నీ సరిపోక రుషికొండలో మరో ప్యాలెస్ కట్టారు.
పల్నాడు జిల్లాలో నరహంతకులను వదిలిపెట్టేది లేదు..
తెదేపా, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టారు. పవన్, నా ఆలోచనలు ఒక్కటే.. మాలో విభేదాలు సృష్టించలేరు. అప్పులు చేయడం తెలిసిన పార్టీ వైకాపా.. సంపద సృష్టించి ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ తెదేపా. పల్నాడు జిల్లాలోని నరహంతకులను వదిలిపెట్టేది లేదు. తీవ్రవాదులు, ముఠా నాయకులను అణచివేసింది మేమే. ఈ జిల్లాలో 30మంది తెలుగు తమ్ముళ్లను పొట్టన పెట్టుకున్నారు. కోడెలను వేధించి ఆయన మృతికి కారణమయ్యారు. తాగునీటికోసం వచ్చిన ఎస్టీ మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపారు. పలు గ్రామాల ప్రజలు ఊర్లు వదిలిపోయారు. అభివృద్ధికి మారు పేరు తెదేపా.. విధ్వంసానికి చిరునామా వైకాపా. ఏ తప్పూ చేయని ప్రత్తిపాటి శరత్‌ను అరెస్టు చేశారు. జగన్ చేసిన తప్పులకు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచాలి? బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు. పులివెందుల పంచాయితీ చేస్తే కుర్చీని మడిచి మీ ఊరికి పంపిస్తాం” అని హెచ్చరించారు.