TRINETHRAM NEWS

చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం.. మరిన్ని మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్

ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. మద్యం షాపుల్లో గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయించాలని, ఇందుకు సంబంధించి వారం రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం మొత్తం 3,396 మద్యం షాపులు ఉండగా ఇందులో 10 శాతం అంటే 340 షాపులు గీత కులాలకు ఇవ్వనున్నారు.

గౌడ, శెట్టి బలిజ, ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీసాయన, శెగిడి, గౌండ్ల, బలిజ, యాత, సోంది వంటి కులాలకు 10 శాతం రిజర్వేషన్ కింద షాపులు కేటాయిస్తారు. షాపులను అక్కడ ఉన్న ఆయా కులాల సంఖ్య ఆధారంగా వారికి కేటాయిస్తారు. ఇందుకోసం ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కొక్కరు ఎన్ని షాపుల కోసం అయినా ఫీజు చెల్లించి ధరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తికి ఒకటే షాపు కేటాయిస్తారు. ఈ షాపుల కాలపరిమితి 2026 సెప్టెంబర్ 30 వరకు ఉంటుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన అధికారులు… ఆ వివరాలను సీఎం ముందు ఉంచారు. అన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి నోటిఫికేష్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మద్యం రిటైల్ షాపులకు ఇచ్చే మార్జిన్‌ను కూడా పెంచుతూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు మద్యం షాపులకు 10.5 శాతం మార్జిన్ ఇస్తున్నారు. దీని వల్ల తాము నష్టపోతున్నామని, మార్జిన్ పెంచాలని యజమానులు కోరుతున్నారు. ఈ విషయంలో వాస్తవ పరిస్థితులను పరిశీలించిన ప్రభుత్వం మార్జిన్‌ను తెలంగాణలో ఇచ్చినట్లు ఇక్కడ కూడా 14 శాతం ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. మరోవైపు రూ. 99కి మద్యం అందుబాటులోకి తేవడం, 21 శాతం అమ్మకాలు వీటిపైనే సాగుతున్నాయని.. దీని వల్ల అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని అధికారులు వివరించారు. రాష్ట్రంలో 72 శాతం అమ్మకాలు జరిగే 20 మద్యం బ్రాండ్ల రేట్లను తెలంగాణతో పోల్చినప్పుడు ఒక్క బ్రాండ్ తప్ప 19 బ్రాండ్ల మద్యం ఎపిలోనే తక్కువ రేటు ఉందని అధికారులు వివరించారు.

ప్రతి సంవత్సరం మద్యం అమ్మకాలు పెరుగుతాయని.. అయితే తక్కువ రేట్లకే మద్యం అమ్మకం వల్ల ప్రభుత్వానికి ఆశించిన స్థాయి ఆదాయం లభించడం లేదని అధికారులు తెలిపారు. అయినా సరే తక్కువ రేటుకే మద్యం అన్ని చోట్లా అందుబాటులో ఉండేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. అదే సమయంలో రాష్ట్రంలో బెల్ట్ షాపుల విషయంలో కఠినంగా ఉండాలని సీఎం సూచించారు. మద్యం తయారీ, సరఫరా, సేల్స్‌ను టెక్నాలజీ సాయంతో పర్యవేక్షించి.. నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. హోలోగ్రామ్ ద్వారా ఎక్కడ తయారైన మద్యాన్ని ఎక్కడ అమ్ముతున్నారు అనేది కూడా తెలుసుకోవాలని.. స్టాక్ వివరాలను తెలుసుకుని తప్పు జరిగితే చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రభుత్వం ఆదాయం కోల్పోయినా పర్వాలేదని ప్రజలకు మంచి జరగాలి అని ఈ మద్యం విధానం తీసుకువచ్చామని..దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇతర రాష్ట్రాల మద్యం, నకిలీ మద్యం రాకుండా చూడాల్సిన అవసరం ఉందని సీఎం ఆదేశించారు.

ఈ 6 నెలల్లో బెల్ట్ షాపుల మీద 8,842 కేసులు బుక్ చేశామని.. 26 వేల లీటర్లు సీజ్ చేశామని అధికారులు చెప్పగా.. బెల్ట్ షాపుల విషయంలో ఉపేక్షించవద్దని.. వారికి మద్యం అమ్మిన షాపుల పైనా చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. మద్యం అక్రమ తయారీని అరికట్టేందుకు, బెల్ట్ షాపులు నియంత్రణకు, మద్యం వల్ల కలిగే అనర్థాలను వివరించేందుకు నవోదయం 2.0 పేరుతో జనవరి నుంచి ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అక్రమంగా మద్యం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి చర్యల ద్వారా వారి జీవితాల్లో మార్పులు తెచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టనన్నట్లు అధికారులు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App