TRINETHRAM NEWS

5నుంచి చందన యాత్ర మహోత్సవాలు
5న తిరువీధి ఉత్సవం .. 6న కల్యాణోత్సవం .. -7న నిజరూప దర్శనం .. 9న అన్నసమారాధన .. పుష్పయాగం

Trinethram News : రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 3: స్థానిక కోరుకొండ రోడ్డులోని సింహాచల నగర్ శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామి క్షేత్రంలో శ్రీ మదుభయ వేదాన్తా చార్య పీఠం ట్రస్టు, శ్రీరంగం ఆధ్వర్యాన ఫిబ్రవరి 5నుంచి 9వ తేదీ వరకూ 23వ వార్షిక చందన యాత్ర మహోత్సవాలు నిర్వహించడానికి ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్య సింహాచలం, కాలెపు నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపధ్యంలో ఆలయ ప్రాంగణంలో సోమవారం ఉదయం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో అర్చకులు అవసరాల శ్రీకిరణ్ స్వామి వివరాలు వెల్లడించారు.

4వ తేదీ మంగళవారం సాయంత్రం 6గంటలకు ఉత్సవ ప్రార్ధన, విష్వక్సేన పూజ, పుణ్యాహవ చనం, ఋత్విక్ వరుణం, రక్షా సూత్రం, అంకురారోపణ, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయని తెలిపారు. 5వ తేదీ బుధవారం ఉదయం 8గంటలకు ధ్వజారోహణ (గరుడ ప్రసాదం), యాగశాల ప్రవేశం, నిత్యహోమాలు, నిత్య పూర్ణాహుతి, సంతాన సాఫల్యం కోసం గరుడ ప్రసాద వితరణ ఉంటాయని వివరించారు. సాయంత్రం 4గంటలకు తిరువీధి (గరుడ సేవ) ఉత్సవం ఉంటుందని ఆయన చెప్పారు.

ముప్పిరాల అనంతాచార్యులు, పరాశర రఘునాధ భట్టర్ స్వామి ఆధ్వర్యంలో ఆలయం నుంచి మొదలై, కంబాలచెర్వు, దేవీచౌక్, కోటగుమ్మం, మెయిన్ రోడ్డు, సాయికృష్ణ, భారతబొమ్మలు, జాంపేట, కంబాలచెర్వు మీదుగా సుమారు 11కి మీ ఊరేగింపు సాగి, తిరిగి ఆలయానికి చేరుతుంది. 6వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు నిశా చూర్ణోత్సవం (పసుపు కొట్టుట), నవకలశ స్నపనం, సాయంత్రం 6గంటలకు ఎదురు సన్నాహం, తిరుకల్యాణ మహోత్సవం, మూర్తి కలశారాధన నిర్వహిస్తారు.
7వ తేదీ శుక్రవారం తెల్లవారుఝామున 3గంటలకు సుప్రభాతం, ఆరాధన, చందనోత్తరణ, సువర్ణ పుష్పార్చన , ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకూ నిజరూప దర్శన సేవ, రాత్రి 8గంటలకు నిజరూప స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం, 9గంటలకు చందన సమర్పణ, తీర్ధ గోష్టి తదితర కార్యక్రమాలుంటాయి. 8వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఆరాధన హోమాలు, చందన రూపంతో నిత్యరూప దర్శనం(చందనరూప సేవ), 11గంటలకు శ్రీవారి చక్రస్నానం, సాయంత్రం 6 గంటలకుచోరోత్సవం నిర్వహిస్తారు.

9వ తేదీ అదివారం ఉదయం 10గంటలనుంచి శ్రీ వారి ప్రసాదం, తదియారాధన (అన్న సమారాధన), సాయంత్రం 6గంటలకు పుష్పయాగం, ద్వాదశారాధనలు, మహా పూర్ణాహుతితో ఉత్సవ పరిసమాప్తి అవుతుంది. కావున భక్తజనులు ఈ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఆలయ ధర్మకర్తలు కాలెపు సూర్య సింహాచలం, కాలెపు నాగేశ్వరరావు, వీరలక్ష్మి, శ్రీ మదుభయ వేదాన్తా చార్య పీఠం ట్రస్టు ప్రతినిధులు శిఘాకొల్లి సీతారామాంజనేయులు, గొల్లపూడి రామలింగేశ్వ రరావు, అర్చకులు చిరంజీవి పండిట్ జీ, తదితరులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chandana Yatra