Trinethram News : వైఎస్ వివేకా హత్య కేసు (YS Viveka Case) అప్రూవర్ దస్తగిరి (Dastagiri) చేసిన ఆరోపణలపై దేవిరెడ్డి శంకర్ రెడ్డి (Devireddy Shankar Reddy) కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి (Chaitanya Reddy) తాజాగా స్పందించారు..
తాను కడప సెంట్రల్ జైలుకు (Kadapa Central Jail) మెడికల్ క్యాంపు కోసం వెళ్లానని, జైల్లో ఉండే వారి ఆరోగ్య పరీక్షల నిమిత్తమే అక్కడికి వెళ్లానని తెలిపారు. తాను నిజంగానే దస్తగిరిని జైల్లో బెదిరించి ఉంటే.. అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. మెడికల్ క్యాంపుకు వెళ్లినప్పుడు తనతో పాటు జైలు అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది కూడా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. జైలులో ప్రతిచోట సీసీ కెమెరాలు కూడా ఉంటాయన్నారు. అప్పుడే ఫిర్యాదు చేసి ఉంటే.. సాక్ష్యాధారాలతో పట్టుబడి ఉండేవాడినని తెలిపారు. మూడు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు.
దస్తగిరి ఎవరి డైరెక్షన్లో మాట్లాడుతున్నాడో అందరికి అర్థమవుతోందని చైతన్య రెడ్డి పేర్కొన్నారు. దస్తగిరి అంత క్రిమినల్ మైండ్ ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన తండ్రి శంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కోర్టులో నడుస్తోందని, బెయిల్ రాకుండా అడ్డుకునేందుకే ఈ కథలన్ని అల్లుతున్నారని ఆరోపించారు. బెయిల్ తిరష్కరణకు గురైన తరువాత మళ్లీ నాలుగైదు నెలలు ఇలాంటివేమీ ఉండవని చెప్పారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడంలోనూ కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నిష్పక్షపాతంగా జరగడం లేదని వివేకా కుమార్తె సునీత (YS Sunitha Reddy) ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. హత్య జరిగిన తరువాత డాక్యుమెంట్స్ కోసం వెతికానని దస్తగిరి చెప్పాడని.. హత్య జరిగాక ఎవరైనా పారిపోతారు గానీ, డాక్యుమెంట్స్ కోసం వెతుకుతారా? అని అడిగారు. పీఏ క్రిష్ణారెడ్డి సైతం.. వివేకానంద రెడ్డి కింద పడి, రక్తపు వాంతులతో చనిపోయారని చెప్పాడని గుర్తు చేశారు.
వివేకా హత్య తర్వాత మీడియా ఎదుట మాట్లాడింది మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy) అని, సునీత ఎందుకు వీటిపై ప్రశ్నించడం లేదని చైతన్య రెడ్డి అడిగారు. ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) రాత్రంతా వాట్సాప్‌లో యాక్టీవ్‌గా ఉన్నారని ఆరోపించారని.. ఎన్నికల సమయంలో ఎంపీగా అయనకు సవాలక్షా మెసెజ్‌లు వచ్చి ఉంటాయని చెప్పారు. అంతకుముందెప్పుడూ ఆయన వాట్సాప్‌లో యాక్టివ్‌గా ఉన్నారో లేదో చూడండని అన్నారు. చెయ్యని తప్పుకు తన తండ్రి శంకర్‌ను రెండున్నరేళ్లుగా జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి బయటకు రాకుండా బెయిల్ అడ్డుకోవడానికే ఈ ఆరోపణలని వ్యాఖ్యానించారు. ఈ డ్రామాలు, కథలన్ని ఇప్పటివి కావని.. కేసు మొదటి నుంచే అబద్ధాలు చెప్తున్నారని చైతన్య రెడ్డి చెప్పుకొచ్చారు..