TRINETHRAM NEWS

విశాఖ చేరుకున్న కేంద్ర కమిటీ

రుషికొండ నిర్మాణాల పై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నియమించిన నిపుణుల కమిటీ తనిఖీలు ప్రారంభించింది. రుషికొండలో అనుమతులు లేకుండా తవ్వకాలు, నిర్మాణాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ హైకోర్ట్‎లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం మనకు తెలిసిందే. దీనిపై హైకోర్ట్ విచారణ చేపట్టిన నేపథ్యంలో కొన్ని కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర కమిటీ విశాఖ చేరుకుని నిజ నిర్ధారణ చేపట్టింది.

వాస్తవానికి గతంలోనే హైకోర్ట్ నియమించిన నిపుణుల కమిటీ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ప్రకారం ఎక్కడైనా నిబంధనల ఉల్లంఘన జరిగి ఉంటే సరిచేయాలని హైకోర్ట్ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖను ఆదేశించింది. అయితే మళ్లీ పిటిషన్ దార్లు సరికొత్త ఆరోపణలను కోర్ట్ ముందుకు తీసుకువచ్చారు. దీంతో తాజాగా నియమించిన కమిటీ ప్రస్తుతం విశాఖకు చేరుకుని రుషికొండలో పర్యటిస్తోంది. కమిటీ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను, సమాచారాన్ని జీ వీ ఎం సీ అధికారులు అందిస్తున్నారు.

అధికారుల నుంచి వివరాల సేకరణ

రుషికొండ పై టూరిజం డిపార్ట్మెంట్ నిర్మిస్తోన్న నిర్మాణాలు అనుమతి పొందిన వాటికంటే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని, కోస్టల్ రెగ్యులేషన్ నిబంధనలు పాటించడం లేదంటూ హైకోర్ట్‎లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన నేపథ్యంలో ఎంవోఈఎఫ్ రెండోసారి నియమించిన కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ నిపుణుల కమిటీ గురువారం రుషికొండను సందర్శించింది. కే. గౌరప్పన్ నేతృత్వంలో నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయి నబుల్ కోస్టల్ మేనేజ్మెంట్ – ఎన్సీఎసీసీఎం పబ్లిక్స్ వర్క్స్ విభాగం, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, ఎంవోఈఎఫ్ ప్రాంతీయ కార్యాలయం నుంచి వచ్చిన కమిటీ సభ్యులు రుషికొండ వద్దకు చేరుకుని టూరిజం శాఖ నిర్మిస్తున్న నిర్మాణాలను పరిశీలించారు. ప్రతీ బ్లాక్ వద్దకూ వెళ్లి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే నిర్మాణాల కోసం తవ్విన ప్రాంతంలోని మట్టిని డంప్ చేసిన ప్రాంతాలను చూసి వచ్చారు. ఏపీటీడీసీ, జీవీఎంసీ అధికారులు దగ్గరుండి కమిటీకి అన్నీ వివరాలను అందించారు

గతంలోనూ ఒక కమిటీ సందర్శన

రుషికొండ పై నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై మొదట హైకోర్టు 2022.11.03న ఒక కమిటీని ఏర్పాటు చేసి పరిశీలించాలని ఆదేశించింది. దీంతో 2023.11.13న అయిదుగురు సభ్యులతో కూడిన సంయుక్త పరిశీలన కమిటీ సర్వే చేపట్టి నెలలో న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ప్రకారం ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగి ఉంటే చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది. అయితే మళ్లీ రుషికొండ మీద నిర్మిస్తున్న ప్రతి బ్లాకులోనూ సీఆర్ జెడ్ – తీర ప్రాంత క్రమబద్ధీకరణ జోన్ ఉల్లంఘనలు జరిగినట్లు, చర్యలు తీసుకోవాలంటూ పిటిషన్ దార్లు మళ్లీ కోర్ట్ దృష్టికి తీసుకురాగా ఎలాంటి చర్యలు చేపట్టారో వివరించాలని ఏపీ హైకోర్ట్, కేంద్ర పర్యావరణ – అటవీశాఖను ఆదేశించింది. దీంతో గత నెల 29న ఎంవోఈఎఫ్ ఉల్లంఘనల పరిశీలనకు మరో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు న్యాయస్థానానికి తెలియజేసింది. ఆ కమిటీ రుషికొండను తాజాగా సందర్శిస్తోంది.