TRINETHRAM NEWS

ఎల్ఆర్‌ఎస్‌పై (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ పోరుబాటకు దిగింది. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో, హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కార్యాలయాల వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునిచ్చింది.

7వ తేదీన జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను కలిసి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించింది.

రాష్ట్ర ప్రజలపై ఆర్థిక భారం మోపడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను వాడుకుంటోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తాము తెచ్చిన పథకాలకు ఆనాడు అడ్డు చెప్పి ఇప్పుడు అవే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. ఎల్ఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతలు నాలుక మడతేశారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారన్న కేటీఆర్.. ఉచితంగా భూములు క్రమబద్దీకరిస్తామని ఉత్తమ్ చెప్పారని గుర్తు చేశారు.

మరోవైపు ఇటీవలే లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి మార్చి 31లోగా క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది.