TRINETHRAM NEWS

Trinethram News : హర్యానాలో భారతీయ జనతా పార్టీ గెలుపు చూసిన తర్వాత రాజకీయాల్లో గెలవాలంటే లాటరీ సాధ్యం కాదని… ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే ప్రత్యామ్నాయంగా ఉన్న తమకే ఓట్లేస్తారని ఆశపడటంలో అర్థం ఉండదని తేలిపోయింది. హర్యానాలో ప్రజాభిప్రాయం ఎన్నికలకు ముందే చాలా స్ఫష్టంగా కనిపించింది. బీజేపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ గెలుపు తీరాలకు చేరిపోయింది.

బీజేపీపై వ్యతిరేకతతో తమకే ఓట్లేస్తారని కాంగ్రెస్ భావన

ప్రభుత్వ వ్యతిరేకత వల్ల తాము గెలిచేస్తామని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ అనుకుంది. అందుకే రాజకీయ సమీకరణాలను పట్టించుకోలేదు. హోరాహోరీగా జరిగిన పోరులో గెలుపును దూరం చేసిన కొన్ని స్థానాల్లో ఐదు వందల ఓట్ల తేడాతోనే సీట్లు కోల్పోయారు. అంటే.. ఎలక్షనీరింగ్ ను కాంగ్రెస్ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసింది. ఓట్లు చీలిపోకుండా చేసుకోవడంలో విఫలం అయింది. అది మాత్రమే కాదు సొంత పార్టీ నేతల్లో ఐక్యత కూడా సాధించలేకపోయింది.

బీజేపీపై వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్‌కు ఓట్లేయని జనం

బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేకత ఉంది కానీ ఆ పార్టీ ఓడిపోవడం లేదు. యూపీలో రెండు సార్లు గెలిచారు. ఉత్తరాఖండ్ లోనూ అంతే. హర్యానాలో మూడో సారి గెలిచారు. గుజరాజ్‌లో గెలుస్తూనే ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అతి కష్టం మీద ఒక్కసారి గెలిచినా నిలబెట్టుకోలేకపోయింది. గత ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని చెప్పుకున్నా గెలిచింది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వరుసగా గెలుస్తూ వస్తోంది. అధికార వ్యతిరేకత కారణంగా ఒక్క కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో మాత్రమే అధికారం కోల్పోయారు. కేంద్రంలో వరుసగా మూడో సారి గెలిచారు. ఈ విజయాలకు కాంగ్రెస్ లాటరీ మీద ఆధారపడి పోరాడకపోవడమే కారణం.

ప్రజల్లో పలుకుబడి లేని నేతలతో కాంగ్రెస్ ఏం చేయగలుగుతుంది ?

బలమైన, వ్యూహ రచనలో దిట్ట అయిన ప్రత్యర్థి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతకు మించి ఆలోచించాలి. జైరాం రమేష్ లాంటి ప్రజల్లో పలుకుబడి లేని నేతలతో వ్యూహరచన చేసుకుని పాత పద్దతుల్లో బీజేపీపై ప్రజలకు కోసం వస్తే మాకే ఓట్లు వేస్తారని రాజకీయాలు చేస్తే ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కాంగ్రెస్ పార్టీనే ప్రత్యర్థిగా ఉన్నంతకాలం ఇక బీజేపీకి ఢోకా ఉండదని హర్యానా ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App