బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి భారీ ఊరట..
Trinethram News : హైదరాబాద్ : వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. బోంరాస్‌పేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లగచర్ల దాడి ఘటనలో అరెస్టయిన నరేందర్ రెడ్డి ఇప్పటికే బెయిల్‌పై బయటికి వచ్చారు. లగచర్ల దాడి ఘటన కంటే ముందే ఆయనపై బోంరాస్ పేట పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కాగా, ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ నరేందర్ రెడ్డి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ (సోమవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం ముందస్టు బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని, రూ.25 వేల సొంత పూచికత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రతి సోమవారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని హైకోర్టు ఆదేశించింది. కాగా, నవంబర్ 11న కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు సేకరించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై దాడి చేశారంటూ 24 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు కుట్ర చేశారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్, సురేశ్ అనే మరో వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. రైతులు, ఎమ్మెల్యేను చర్లపల్లి, సంగారెడ్డి జైళ్లకు తరలించారు. దీనిపై తెలంగాణ హైకోర్టును మాజీ ఎమ్మెల్యే ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం 24 మంది రైతులతోపాటు పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 19న ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు. కాగా, తాజాగా మరో కేసులోనూ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App