
Trinethram News : ఆత్మకూరు : వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి విషపు గుళికలు మింగి బలవన్మరణం చెందిన ఘటన ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.., ప్రభాకరరెడ్డి (28) బెంగళూరులోని సాఫ్ట్‌వేర్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. గత 3 సంవత్సరాల నుంచి వర్క్‌ఫ్రం హోమ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. రెండు సంవత్సరాల నుంచి ఎన్ని వివాహ సంబంధాలు చూసినా సరిపోవడం లేదు. ఇక వివాహం కాదని మనస్తాపం చెందిన అతను విషపు గుళికలను మింగాడు. కుటుంబసభ్యులు ఇంటికి వచ్చి చూసే సరికి విగతజీవిగా పడి ఉన్నాడు. శివారెడ్డి, సావిత్రమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక్క కుమారుడు ఉన్నారు. తమకు కడవరకూ తోడుగా ఉంటాడని అనుకుంటే వదిలివెళ్లావా? అంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు.
