TRINETHRAM NEWS

పుణ్యక్షేత్రంలో అలరించిన ఆధ్యాత్మిక శోభయాత్ర

ఇక ప్రతి ఏడాది ఫిబ్రవరి 24న ఆచారంగా తిరుపతి పుట్టినరోజు

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి

కనువిందు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు

తిరుమ‌ల శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల‌ను త‌ల‌పించేలా తిరుపతి 894వ ఆవిర్భావ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీటీడీ ఆధ్వర్యంలో చైర్మన్‌ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తిరుప‌తి గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌య ప్రాంగ‌ణంలో ఉత్సవాల‌ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ జగద్గురువు రామానుజాచార్యులు తిరుపతిని 1130వ సంవత్సరం ఫిబ్రవరి 24న శంకుస్థాపన చేసి గోవిందరాజపురంగా నామకరణ చేశారని అనంతరం నేడు తిరుపతిగా భాసిల్లుతున్నద‌న్నారు.

ఇక నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న సాంప్రదాయంగా, ఆచారంగా తిరుపతి పుట్టిన రోజు వేడుకను టీటీడీ క్యాలెండర్ లో భాగం చేస్తామని వెల్లడించారు. తిరుప‌తి న‌గ‌రం ప్రపంచానికి ఓ ఆదర్శ నగరం కావాలని ఆకాంక్షించారు. టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ నలుమూలల నుంచి శ్రీ‌వారి ద‌ర్శనానికి తిరుపతి మీదుగా తిరుమలకు చేరుకుంటారని తెలిపారు. భ‌క్తుల‌కు మ‌రింత ఆధ్యాత్మిక ఆనందాన్ని క‌లిగించేందుకు తిరుపతి నగరాన్ని కూడా తిరుమల తరహాలో సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టడం జరిగింద‌న్నారు.

అలరించిన ఆధ్యాత్మిక శోభా యాత్ర

తిరుపతి ఆవిర్భావ వేడుకల సందర్భంగా చైర్మన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, శోభాయాత్రను ప్రారంభించారు. టీటీడీ డీపీపీ, అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టుకు చెందిన వంద‌లాది మంది క‌ళాకారులు చెక్క భజనలు, కోలాటాలతో ఆడుతూ, గోవింద నామ సంకీర్తనలు, వేదపండితులు మంత్రోచ్చారణల మ‌ధ్య శోభాయాత్రను నిర్వహించారు. క‌ళాకారుల వివిధ దేవ‌తామూర్తుల, పౌరాణిక వేషధారణలు విశేషంగా ఆకర్షించాయి.