TRINETHRAM NEWS

చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మార్చి 17న తెదేపా-జనసేన-భాజపా ఉమ్మడి బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బొప్పూడి ప్రసన్నాంజనేయస్వామి ఆలయం సమీపంలో సభా స్థలాన్ని శనివారం తెదేపా నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, ఏలూరి సాంబశివరావు, దామచర్ల సత్య, వేపాడ చిరంజీవిరావు, పెందుర్తి వెంకటేశ్‌, చదలవాడ అరవిందబాబు, జనసేన నేతలు గాదె వెంకటేశ్వరరావు, రాజా రమేశ్‌ పరిశీలించారు.
ఈ సభలో ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు, భవిష్యత్‌ కార్యాచరణను చంద్రబాబు, పవన్ ప్రకటించనున్నారు. ఎన్డీఏలో తెదేపా చేరిన తర్వాత జరగబోయే తొలి బహిరంగ సభ కావడంతో.. దాదాపు 10 నుంచి 15 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నట్టు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. బహిరంగసభకు ప్రధాని మోదీ కూడా హాజరవుతారనే సమాచారం ఉందన్నారు. ‘‘చిలకలూరిపేట సభ ద్వారా దేశానికి ఒక సందేశం ఇస్తాం. చంద్రబాబు, పవన్‌ దిల్లీ వెళ్లిన దగ్గర్నుంచి జగన్‌, వైకాపాలో కలవరం మొదలైంది. మూడు పార్టీల మధ్య విభేదాలు సృష్టించాలనే దుర్బుద్ధితో వైకాపా ప్రచారం చేస్తోంది. సీఎం జగన్‌ ఏపీని సర్వనాశనం చేశారనే సమాచారం దిల్లీ పెద్దలకు ఉంది. ఉమ్మడి మేనిఫెస్టోను ప్రకటించే సభ చరిత్రలో నిలిచిపోతుంది’’ అని తెలిపారు….