TRINETHRAM NEWS

Trinethram News : జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్‌..

ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. పార్టీ కోసం పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.. రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని తెలిపారు పవన్‌.. మన కూటమి అధికారంలోకి వస్తోందని స్పష్టం చేసిన ఆయన.. క్షేత్రస్థాయి నుంచి మన బలాన్ని సద్వినియోగపరుకొంటూ కూటమిని గెలుపు దిశగా తీసుకెళ్లేందుకు ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని సూచించారు. వ్యక్తిగతంగా నా గెలుపు గురించి కాదు.. సమిష్టిగా గెలుపు కోసమే తొలి నుంచి నా వ్యూహం, అడుగులు ఉంటున్నాయని తెలిపారు..

జనసేన కోసం తపించి పని చేసిన ప్రతీ ఒక్కరికీ సముచిత గౌరవం కల్పించే బాధ్యత తీసుకుంటానని భరోసా ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌.. 2019 తర్వాత పార్టీ బలంగా నిలిచేందుకు దోహదపడ్డ నాయకులకు అండగా ఉంటామని చెప్పారు. ప్రజారాజ్యం సమయంలో ఉన్న ఒక చిన్న పరిచయంతో ఒక నాయకుడికి 2014 తర్వాత టీటీడీ సభ్యుడిగా రెండు పర్యాయాలు పదవి ఇప్పించగలిగాను.. అప్పటికీ ఆయన మన పార్టీలోకి రాలేదని ఉదహరిస్తూ.. జనసేన కోసం నిలిచిన ఎవ్వరినీ విస్మరించేది లేదు అన్నారు. ఇప్పటి ఎన్నికల్లో స్థానాలు మాత్రమే కాకుండా కూటిమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చే అవకాశాలూ దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో కావచ్చు.. పీఏసీఎస్‌ల్లో, ఇతర కీలక నామినేటెడ్‌ పదవుల్లో సముచిత స్థానాలు మనకు దక్కుతాయి.. తద్వారా అందరినీ బలోపేతం చేసి ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. మూడింట ఒక వంతు పదువులు దక్కించుకుందాం అన్నారు. ఏపీకి సుస్థిర పాలన అవసరమని, అప్పుడే అభివృద్ధి సాధ్యమని, అలాంటి సుస్థిర పాలన మన కూటిమి అందించగలదని ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు స్పష్టంగా చెబుతున్నారని తెలిపారు.. ఇక, పార్టీ పక్షాన ఎన్నికల నిర్వహణ కోసం రూ.10 కోట్లు తన స్వార్థితాన్ని నిధిగా ఇవ్వనున్నట్టు ఈ సమావేశంలో ప్రకటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌