Allotment of houses on the ground floor for 17 disabled beneficiaries
లాటరీ పద్ధతిన 466 మంది పెద్దపల్లి డబుల్ బెడ్ రూం లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు
*అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇండ్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
*అమర్ చంద్ కళ్యాణం మండపంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే
పెద్దపల్లి, జూన్ -29: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
స్థానిక అమర్ చంద్ కళ్యాణ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన పెద్దపల్లి పట్టణ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి పాల్గొనీ లాటరీ పద్ధతిన 466 మంది లబ్దిదారులకు ఇండ్లను కేటాయించారు.
ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసి సంవత్సరన్నర కాలం గడిచిందని, తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లబ్ధిదారులకు ఇండ్లు కేటాయింపు చేయాలని ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు.
ప్రస్తుతం పారదర్శకంగా లబ్ధిదారులకు ఇండ్ల కేటాయింపు జరుగుతుందని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నివాసయోగ్యంగా మార్చేందుకు విద్యుత్తు, త్రాగునీటి సరఫరా డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్, మొదలగు మౌళిక వసతులు 6.5 కోట్లతో పనులు మూడు, నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని, అప్పుడు లబ్ధిదారులు వారి ఇండ్లలో నివసించడానికి వెళ్లవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇండ్లు ఉండాలనే లక్ష్యంతో మొదటి దశలో సొంత జాగా ఉన్న వారందరికీ ఇండ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామని, అనంతరం రెండవ, మూడవ విడతలో జాగా లేని వారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి కావాల్సిన నిధులను సైతం అందించడం జరుగుతుందని అన్నారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, మహిళలకు ఉచిత బస్సు రవాణా, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఉచిత విద్యుత్తు పథకాలు అమలు చేశామని, 2 లక్షల రుణ మాఫీ ప్రక్రియ జరుగుతుందని, రాబోయే వానాకాలం నుంచి సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రకటిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలోని రాంపల్లి, చందపల్లి వద్ద నిర్మించిన 484 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గతంలో దరఖాస్తులు స్వీకరించి, క్షేత్రస్థాయిలో విచారణ చేసి అర్హులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.
ప్రస్తుతం 466 మంది డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పారదర్శకంగా ఇండ్ల కేటాయింపు ప్రక్రియ నిర్వహిస్తున్నామని, లాటరీ పద్ధతిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు జరుగుతుందని, ఈ ప్రక్రియను పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 17 మంది దివ్యాంగ లబ్ధిదారులకు గ్రౌండ్ ఫ్లోర్ నందు ఇండ్లు కేటాయిస్తున్నట్లు అదనపు కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, తహసిల్దార్ రాజ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ , వైస్ చైర్మన్, కౌన్సిలర్ లు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App