‘ఆ డబ్బు అంతా నాది కాదు’ : ఎంపి ధీరజ్
న్యూఢిల్లీ : ఒడిశాకు చెందిన డిస్టలరీ కంపెనీపై ఆదాయపు పన్ను శాఖా అధికారులు గత బుధవారం దాడులు చేశారు. ఈ కంపెనీని కాంగ్రెస్ ఎంపి ధీరజ్ సాహు కుటుంబం నిర్వహిస్తోంది.
ఐటి దాడుల్లో పన్ను అధికారులు రూ. 350 కోట్లకుపైగా డబ్బును పట్టుకున్నారు. ఈ డబ్బుకు సంబంధించి పదిరోజుల తర్వాత ఎంపి ధీరజ్ సాహు స్పందించారు. ‘ఐటి అధికారులు పట్టుకున్న డబ్బు మొత్తం మద్యం విక్రమాలకు సంబంధించిన డబ్బే.
కానీ ఈ డబ్బుకు కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇతర ఏ రాజకీయ పార్టీలకు కానీ సంబంధం లేదు. పట్టుకున్న డబ్బు అంతా నాది కాదు. నా కుటుంబ సభ్యులది, ఇతర సంబంధిత సంస్థలకు చెందినది. నేను నా అకౌంట్ వివరాల్ని ఐటి కంపెనీకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను.’ అని ఆయన అన్నారు.
కాగా, డిస్టిలరీ కంపెనీని ధీరజ్ సాహు కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన ఐటి అధికారులు దాడులు నిర్వహించినప్పుడే చెప్పారు. ఈ దాడుల్లో 176 బ్యాగుల్లో ఉన్న డబ్బును అధికారులు లెక్కించారు. మొత్తం రూ. 351 కోట్ల నగదు లెక్క తేలినట్లు ఐటి అధికారులు వెల్లడించారు. ధీరజ్ సాహు వద్ద అన్ని కోట్ల డబ్బు పట్టుబడడంపై బిజెపి నేతలు తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.