TRINETHRAM NEWS

నటి కస్తూరి తెలుగుజాతికి క్షమాపణలు చెప్పాలి

ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ డిమాండ్

Trinethram News : తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి తెలుగు జాతికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగువారు తమిళనాడులోని అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చారని కస్తూరి చేసిన వ్యాఖ్యలు తెలుగుజాతికి తీవ్ర అవమానకరం అన్నారు. తమిళనాడును ఏలిన వారు తెలుగువారని తెలిపారు. రాణి మంగమ్మ మధురను పరిపాలించారని, విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల పాలన కింద నేటి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఉండేవన్నారు. ఆయా ప్రాంతాలు తెలుగు ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలు కాబట్టే రాయలవారు రాజభాషగా తెలుగును అమలు చేశారని గుర్తు చేశారు. అనంతరం మధుర, తంజావూరు, పుదుకోట ప్రాంతాలను నాయక రాజులు పరిపాలించి తెలుగును పరిపాలన భాషగా అమలు చేశారని గుర్తు చేశారు. శాతవాహన సామ్రాజ్యం గౌతమీపుత్ర శాతకర్ణి పరిపాలనలోనూ తెలుగు వారి పరిపాలనలోనే ఉందన్నారు. తెలుగువారు తమిళనాడును పరిపాలించారు గాని అక్కడి అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వెళ్ళలేదని నటి కస్తూరి గ్రహించాలన్నారు.
చరిత్ర తెలియకుండా మాట్లాడవద్దని సూచించారు. మద్రాసు ప్రెసిడెన్సీలోను తొలి ప్రధానిగా ఒమండూరు రామస్వామి, మద్రాసు సంయుక్త రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా కుమారరాజా, బొబ్బిలి రాజా, మునిస్వామి నాయుడు పరిపాలించారన్నారు. ఏపీ తమిళనాడు విడిపోయే వరకు అత్యధిక కాలం తెలుగు వారే పరిపాలించారనే విషయం ఆమెకు తెలియదా అన్నారు.

తెలుగు జాతి గురించి ఆమె వ్యాఖ్యలు అత్యంత అవమానకరంగా ఉన్నాయన్నారు. నేటి చెన్నై మహానగరమైన నాటి చెన్నపట్నం నిర్మించింది ఒక తెలుగువాడని తెలుసుకోవాలన్నారు. మద్రాసు నగరంలో స్వాతంత్ర ఉద్యమంలో తెలుగువారైన టంగుటూరి ప్రకాశం పంతులు, కాశీనాధుని నాగేశ్వరరావు, దుర్గాబాయి దేశ్ ముఖ్ ప్రధాన పాత్ర పోషించారనే విషయం తెలుసుకోవాలన్నారు.
తెలుగువారు తమిళనాడు ప్రాంత పరిపాలకులుగా ఆ ప్రాంత అభివృద్ధికి దోహదపడితే నేడు ఆమె తెలుగువారిని అవమానకరంగా మాట్లాడిన తీరును ప్రతి తెలుగు వారు ఖండించాలన్నారు. తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి తక్షణమే తెలుగుజాతికి బహిరంగ క్షమాపణలు చెప్పాలని బుద్ధప్రసాద్ సందర్భంగా డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App