AAP MP Swati Maliwal sensational allegations against Kejriwal!
సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన మాలీవాల్ వీడియోలు !
Trinethram News : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ తన చెంపపై ఏడెనిమిసార్లు గట్టిగా కొట్టారంటూ ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్ సంచలన ఆరోపణ చేశారు. కేజ్రీవాల్ అధికారిక నివాసంలో సోమవారం జరిగిన ఈ ఘటనలో పీరియడ్స్ నొప్పితో బాధపడుతున్నానని వారిస్తున్నా నిందితుడు తనపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారని తెలిపారు. అయినప్పటికీ తనను కాపాడేందుకు అక్కడున్న ఎవరూ ముందుకు రాలేదని వాపోయారు. ఈ మేరకు ఆమె ఆరోపించినట్లు గురువారం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఎఫ్ఐఆర్ లో వివరాల ప్రకారం… ‘‘నా జీవితంలో నేనెదుర్కొన్న అత్యంత కష్టకాలం. నొప్పి, గాయం, వేధింపులు నా మనసును బాధించాయి. దాడితో నాకు నడవటం కష్టంగా ఉంది. ఈ ఘటనతో నేను తీవ్రంగా కలత చెందాను. కేజ్రీవాల్‌ను కలిసేందుకు సోమవారం ఉదయం 9 గంటలకు ఆయన నివాసానికి చేరుకున్నాను. డ్రాయింగ్ రూంలో నేను ఎదురు చూస్తుంటే కుమార్ దూసుకొచ్చి, అకారణంగా నాపై అరిచి, నన్ను దుర్భాషలాడారు. నా చెంపపై ఏడెనిమిది సార్లు గట్టిగా కొట్టారు. దీనితో దిగ్భ్రాంతికి లోనై సహాయం కోసం పలుమార్లు అరిచాను. నన్ను రక్షించుకునేందుకు ఆయన్ను కాళ్లతో తోసేశాను. ఆ సమయంలో ఆయన నాపై పడ్డారు. కర్కశంగా లాగారు. కావాలనే నా చొక్కా పట్టుకుని గుంజారు. దాని గుండీలు ఊడిపోయి పైకి వచ్చేసింది. నేను మధ్యలో ఉన్న టేబుల్‌ను ఢీకొట్టి కిందపడిపోయాను.
కుమార్ తన కాళ్లతో నా ఛాతీ, పొట్ట, సున్నితావయవాలపై కనికరం లేకుండా తన్నారు. తీవ్రమైన నొప్పితో కొట్టొద్దంటూ వేడుకున్నా. రుతుస్రావంలో ఉన్నానంటూ, వదిలేయమని మొత్తుకున్నా. సాయం కోసం అరుస్తూనే ఉన్నా నన్ను కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ‘నువ్వేం చేసుకుంటావో చేసుకో. మమ్మల్నేం చేయలేవు. నీ ఎముకలు విరగ్గొడతాం. ఎవరూ గుర్తించలేని చోట నిన్ను పాతిపెడతాం’ అంటూ కుమార్ నన్ను బెదిరించారు. అత్యవసర నంబరు 112కు ఫోన్ చేసి సంఘటనను వివరించాను. ఆ సమయంలో బయటకు వెళ్లిన కుమార్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న భద్రతా సిబ్బందిని తీసుకొచ్చారు. వారు నన్ను బయటకు వెళ్లమన్నారు.
తీవ్రంగా దెబ్బలు తిన్నానని, పీసీఆర్ వ్యాన్ వచ్చే వరకూ ఉండనివ్వాలని వారిని కోరాను. పీసీఆర్ సిబ్బంది సాయంతో ఆటో ఎక్కాను. అక్కడ నుంచి నేరుగా సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్‌కు చేరి జరిగిన విషయమంతా ఎస్‌హెచ్‌వోకు వివరించాను. తీవ్రమైన నొప్పి… మీడియా నుంచి వస్తున్న ఫోన్లు.. ఘటనను రాజకీయం చేయకూడదని రాతపూర్వకంగా ఫిర్యాదు చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాను’’ అని మాలీవాల్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం ఆమె తీస్ హజారీ న్యాయస్థానంలో మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. గూండాల ఒత్తిడితోనే తన ఆరోపణలు నిరాధారమైనవని పార్టీ పేర్కొందని, తన వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నారని మాలీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
దాడి ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఎంపీకి శుక్రవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలైనట్లు ఈ పరీక్షలో తేలిందని వైద్య వర్గాలు వెల్లడించాయి. స్వాతి మాలీవాల్‌పై దాడి నేపథ్యంలో తాజాగా ఆన్‌లైన్‌లో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. అది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటిలోనిదని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అందులో మాలీవాల్… భద్రతా సిబ్బందితో వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై తాజాగా ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘ప్రతిసారిలాగే… ఈసారి కూడా ఈ రాజకీయ హిట్‌మ్యాన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అసలు విషయం లేకుండా పోస్టులు, వీడియోలను ప్రచారం చేయడం ద్వారా… ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారు’’ అని స్వాతి పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App