Trinethram News : అమరావతి: రాష్ట్రంలోని పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని తెదేపా జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో కొందరు పోలీసులు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తూ బలహీనవర్గాలపై మారణహోమం సాగిస్తున్నారని ధ్వజమెత్తారు..
వెల్దుర్తిలో తెదేపా సానుభూతిపరులైన మత్స్యకారులను వైకాపాలో చేరాలని ఎస్‌ఐ శ్రీహరి ఒత్తిడి చేశారని.. లేదంటే రూ. 2 లక్షల కప్పం కట్టాలని వేధించడంతో దుర్గారావు అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు..
వైకాపా నేతలకు తొత్తుగా మారి దుర్గారావుపై తప్పుడు కేసు బనాయించి, ఆత్మహత్యకు పురిగొల్పడం యావత్ పోలీసు శాఖకే మాయని మచ్చని దుయ్యబట్టారు. దేశంలో ఇలాంటి విపరీత పోకడలు మరెక్కడా లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సోదరుడి మరణానికి కారకుడైన ఎస్ఐ శ్రీహరి లాంటి పోలీసులు మరికొద్దిరోజుల్లో రాబోయే ప్రజాప్రభుత్వంలో కఠినచర్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు..