Trinethram News : బయటపడ్డ వార్డెన్ బాగోతం…
తాగడం ఇష్టం వచ్చినట్లు పిలల్లను చావబాదడం
అతనొక బాధ్యతగల హాస్టల్ వార్డెన్. చదువుకోడానికి వచ్చిన పిల్లలను హాస్టల్లో జాగ్రత్తగా చూసుకుంటూ… చెడు మార్గంలో వెళ్లకుండా తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటున్న పిల్లలను కంటికి రెప్పలా చూడాల్సిన బాధ్యత అతనిపై ఉంది. వీటన్నింటికి భిన్నంగా… ఏకంగా హాస్టల్‌లోనే బార్ ఓపెన్ చేశాడు. అనంతపురంలోని సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్ వార్డెన్ బాగోతం ఇదీ. సంసిద్ధ్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్టల్‌లో వార్డెన్‌గా ఉన్న విజయ శంకర్ వరప్రసాద్ గది చూసిన వాళ్ళు ఎవరికైనా ఇది కచ్చితంగా బార్ అనే విధంగా మద్యం బాటిల్స్ ఉన్నాయి. రోజు హాస్టల్‌కు మద్యం తెచ్చుకొని తాగి విద్యార్థులను ఇష్టం వచ్చినట్టు చావబాదుతున్నాడట.హాస్టల్ వార్డెన్ విజయ శంకర్ దెబ్బలకు తట్టుకోలేక విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులు వెంటనే డయల్ 100 కు ఫోన్ చేసి సంసిద్ధ్ స్కూల్ యాజమాన్యం, హాస్టల్ వార్డెన్ పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు హాస్టల్‌కు వచ్చేసరికి విజయ శంకర్ పరారయ్యాడు. హాస్టల్ కు వచ్చిన పోలీసులకు… విద్యార్థులు తమ ఒంటిపై ఉన్న గాయాలు చూపించడంతో వార్డెన్ విజయ శంకర్ క్రూరత్వం బయటపడింది. అదేవిధంగా వార్డెన్ విజయ శంకర్ గదిని తనిఖీ చేసిన పోలీసులకు ఏకంగా ఒక బార్ కనిపించింది. వందల సంఖ్యలో తాగి పడేసిన కాళీ మద్యం బాటిళ్లు కనిపించాయి. అసలు ఇది హాస్టల్ ఆ… లేక బారా అనేవిధంగా వార్డెన్ గది ఉంది.
సంసిద్ధ్ స్కూల్ హాస్టల్ వార్డెన్ విజయశంకర్ తీరుపై అటు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వార్డెన్ తీరుపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టడంతో పాటు స్కూలు యాజమాన్యంపై, అదేవిధంగా వార్డెన్ విజయశంకర్ పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. సుదూర ప్రాంతాల్లో ఉండే విద్యార్థులన వారి తల్లిదండ్రులు హాస్టల్లో ఉంచి చదివించుకుంటారు. కానీ ఇలాంటి హాస్టల్లో ఇలాంటి వార్డెన్ ఉన్న చోట పిల్లలు నిజంగానే చెడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే హాస్టల్లో ఉన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుతూ… చెడు మార్గంలో వెళ్లకుండా చూసుకోవాల్సిన హాస్టల్ వార్డెనే హాస్టల్లోనే మద్యం బార్ ఓపెన్ చేస్తే పిల్లల భవిష్యత్తు ఏమి అవ్వాలి అంటున్నారు తల్లిదండ్రులు.