Trinethram News : అయోధ్య రామ మందిరానికి ఏపీ నుంచి కానుక వెళ్లనుంది. శ్రీసత్యసాయి జిల్లా చేనేత కార్మికులు పట్టుచీరను తయారు చేసి, సీతాదేవికి బహూమానంగా అందించనున్నారు. 4 నెలలపాటు శ్రమించి 60 మీటర్ల పొడవుతో ఈ చీరను తయారు చేశారు. దీని విలువ సుమారు ఐదు లక్షల వరకు ఉంటుందని అంచనా.
చీరను నాగరాజు డిజైన్ చేయగా, సురేంద్రనాథ్, ఆయన కుమారుడు తేజ మగ్గంపై నేశారు. పట్టు చీరను బహూకరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని, చేనేత కుటుంబాలు చెబుతున్నాయి.
సీతమ్మ కోసం తయారుచేసిన పట్టు చీర 60 మీటర్ల పొడవు ఉంది. ఈ చీర బార్డర్లకు రామాయణ ఘట్టం మొత్తాన్ని చిత్రాలుగా నేశారు. వాటిని కంప్యూటర్‌లో రూపొందించుకుని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుచీర అంచులపై చూపించారు. 5 లక్షల రూపాయల విలువైన పట్టుచీరను పూర్తిగా నాణ్యమైన పట్టుతో తయారు చేసినట్లు వారు తెలిపారు. అయోధ్యకు పంపే ముందు ధర్మవరంలో ఈ చీరను, ప్రజల కోసం ప్రదర్శనగా ఉంచారు. అయోధ్యలో రామాలయం ప్రతిష్ట కార్యక్రమం పూర్తయ్యాక, చీరను తీసుకెళ్లడానికి నాగరాజు, నాగేంద్రనాథ్ కుటుంబసభ్యులు ప్రణాళిక చేశారు.