TRINETHRAM NEWS

TDP-Janasena-BJP: సంక్రాతి తర్వాతే.. ఏపీ పొత్తు కథా చిత్రమ్.. రిపీట్ అవుతున్న 2014 పొత్తులు..!

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలోనూ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఏపీలో మళ్లీ 2014 పొత్తులు రిపీట్ అవుతున్నాయి. టీడీపీ-జనసేన-బీజేపీ మళ్లీ ఒక్కటయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది.. టీడీపీ-జనసేన- బీజేపీ మధ్య మళ్లీ పొత్తులకు లైన్‌ క్లియర్‌ అవుతోంది. బీజేపీ కూడా తమతో కలిసివచ్చేలా ప్రయత్నిస్తామన్న పవన్‌ కల్యాణ్‌ దాదాపు ఒప్పించారు. ఇప్పటికే మూడు పార్టీల మధ్య పొత్తులపై సూత్రప్రాయ అంగీకరం కుదిరింది. త్వరలోనే ఢిల్లీ వెళ్లి తుదిదశ చర్చలు జరపనున్నారు జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌. టీడీపీ-జనసేన ఎక్కడ పోటీచేయాలో తమకు స్పష్టత ఉందని.. సంక్రాంతి తర్వాత ప్రకటన చేస్తామని ఇప్పటికే టీడీపీ నేతలు చెబుతున్నారు. బీజేపీతో సీట్లు సర్దుబాటు తర్వాతే అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉంది.

అటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా పొత్తులపై ఇప్పటికే తమ అభిప్రాయాన్ని ఢిల్లీ పెద్దలకు తెలియజేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలోనూ రాష్ట్రానికి చెందిన మెజార్టీ నాయకులు పొత్తులకు అనుకూలంగా తమ అభిమతం అధిష్టానం ముందుంచారు. ఈ విషయాలను నివేదిక రూపంలో సిద్ధం చేసి ప్రధానమంత్రి నరేంద్రమోదీ టేబుల్‌పై పెట్టారు పార్టీ పెద్దలు. జనసేనతో ప్రస్తుతం పొత్తులో ఉన్నామని ఇతర నిర్ణయాలు అధిష్టానం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి క్లారిటీ ఇచ్చారు.

ఇలా అనేక అనేక సానుకూల అంశాలు పొత్తును ప్రభావితం చేయనున్నాయి. అయితే ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలో ఎవరుండాలో బీజేపీ నిర్ణయిస్తుందని, బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే 75 అసెంబ్లీ, 12 పార్లమెంట్‌ సీట్లు అడుగుతామన్నారు విష్ణువర్ధన్‌రెడ్డి. కొన్ని పార్టీలు పనిగట్టుకుని బీజేపీ స్థాయిని తగ్గించాలని యత్నిస్తున్నాయని ఓ ఛానల్ లో డిబేట్‌లో ఆరోపించారు.

సంక్రాంతిలోగా పొత్తులపై బీజేపీ కేంద్ర నాయకత్వం స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని కమలనాథులంటున్నారు.