With doctorate hands… Selling sapotas.
Trinethram News : తిరువూరు టౌన్ (ఎన్. టీ. ఆర్ జిల్లా )
పట్టణంలోని మధిర రోడ్ సమీపంలో తాజాగా ఉన్న సపోటాలు కొందామని బండి దగ్గరకు వెళ్ళా.వాటిని కొనే ముందు సపోటాలు అమ్మే వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడాను.
ఎటువంటి రసాయన పదార్దాలు కలపకుండా, సహజ పద్ధతిలో తనకున్న కొద్దిపాటి పొలంలో కొన్ని రకాల పండ్లను, మరికొన్ని రకాల కూరగాయలను పండిస్తూ, వాటిపై వచ్చే కొద్దిపాటి ఆదాయంతో జీవనం సాగిస్తున్నాని ఆయన చెప్పాడు. అతనితో మాట్లాడిన తర్వాత సమాజంపట్ల అతనికి బాగా అవగాహన ఉందనిపించింది.
మా మాటల మధ్యలో రమేష్ అనే మిత్రుడు అక్కడికి వచ్చాడు. సపోటాలు అమ్ముకునే వ్యక్తి గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు నాకు చెప్పాడు.అతని పేరు బి.దుర్గారావు అని, తనకు మంచి మిత్రుడు అని చెప్పాడు.
మిత్రుడు రమేష్ మాటల్లో దుర్గారావు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
దుర్గారావు ఏ. కొండూరు మండలంలోని కొండూరు తండాలో జన్మించారు. చిన్న తనం నుంచి ఆయనకు చదువంటే ఇష్టం. కంభంపాడు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివి, అదే గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశారు. పాల్వంచలో డిగ్రీ చేశాడు.అంతటితో చదువు ఆపితే, అతనో సాధారణ వ్యక్తిగా మిగిలేవాడు.
ఒకవైపు పేదరికం అతన్ని వెంబడిస్తున్నా, పట్టు వదలకుండా హైదరాబాద్ లోని సెంట్రల్ యూనివర్సిటీ లో పీ.జి పొంది ఎం. ఏ (హిందీ )పూర్తి చేశాడు. అంతటితో ఆగకుండా ఆదే యూనివర్సిటీలో ఎం ఫిల్ చేశాడు. అంతే ఉత్సాహంతో సెంట్రల్ యూనివర్సిటీలోనే “ఆదివాసీల స్థితిగతులు -వారి అభివృద్ధి “అనే అంశంపై పి. హెచ్ డి చేసి 2016లో డాక్టరేట్ పొందాడు.అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే క్రమంలో దుర్గారావు అనారోగ్యం పాలయ్యాడు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయన జీవనోపాధి కోసం తన దృష్టిని కొంతకాలం వ్యవసాయం వైపు మరల్చాడు.సేంద్రియ పద్ధతి లో సాగు చేస్తూ, జీవనం గడుపుతున్నాడు.ఒకవైపు సపోటాలను అమ్ముతూనే,విష రసాయన పదార్ధాలతో పండించిన పండ్లు, కూరగాయలు తింటే వచ్చే నష్టాలని ప్రజలకు వివరిస్తున్నాడు దుర్గారావు.ఏదో ఒక రోజు తాను అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతానని ఆయన ఆత్మ విశ్వాసంతో చెబుతున్నారు.
రమేష్ చెప్పిన తర్వాత దుర్గా రావు పట్ల నాకు మరింత గౌరవం పెరిగింది. ఇటువంటి వారిని ప్రభుత్వం గుర్తించి ఉద్యోగాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని దుర్గారావును కలిసిన రచయిత, జెవివి ప్రతినిధి యం. రాం ప్రదీప్ అన్నారు.
ఓ సామాన్య గిరిజన కుటుంబం లో పుట్టిన దుర్గారావు ఎంచుకున్న గమ్యం ఎందరికో స్ఫూర్తి అని చెప్పవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App