TRINETHRAM NEWS

ఆ పార్టీ.. ఈ పార్టీ జాన్తానై..!

షాద్ నగర్ లో పేదలు అందరూ నావాళ్లే

షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”

ఎన్నికలకు ముందే రాజకీయాలు – ఆ తరువాత అభివృద్ది

రేపటి నుంచి ప్రజా పాలన “శుభ సమయం” ఆసన్నమైంది

పేదొళ్ళ ముంగిటకు “అభయ హస్తం” వచ్చేసింది

తప్పులు జరిగితే క్షమించను.. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెచ్చరిక

కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజలు అంటే ప్రాణమని దేవుడు ఎక్కడున్నాడో నాకు తెలియదు కానీ, పేదలకు సేవ చేస్తే మాత్రం నిజంగా ఆ దేవునికి సేవ చేసినట్టేనని మానవసేవే మాధవసేవ అని తాను గట్టిగా నమ్ముతానని షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” స్పష్టం చేశారు. బుధవారం షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మేల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడారు.. ప్రజా పాలనపై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేస్తున్నామని తెలిపారు. 28 నుంచి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రతీ కుటుంబానికి అందేలా దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని చెప్పారు. రేపటి నుండి గొప్ప శుభదినం అని ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా నిర్భయంగా అందించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందే రాజకీయాలు గ్రామాల్లో ఉండాలని ఆ తర్వాత పేద ప్రజలను ఆదుకునేందుకు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అనే పరిస్థితులను తాను లెక్కచేయబోనని నిజమైన పేద ప్రజలకు ప్రభుత్వ లబ్ధి చేకూరే విధంగా చూస్తానని అన్నారు. అక్కడక్కడ ఎవరైనా ప్రజలు నాయకుల మాటలు నమ్మి ఆ పార్టీ ఈ పార్టీ అంటూ తిరిగినా అది ఎన్నికల వరకేనని ఎన్నికలు అయిపోయాక నిజమైన అర్హులకు పేదలకు వారు ఏ పార్టీ వారైనా సరే సంక్షేమం అందాలన్నదే నా దృక్పదమని స్పష్టం చేశారు. లీడర్లు కొందరు తప్పుదారి పట్టించినా ప్రజలకు ఎలాంటి నష్టం జరగనివ్వమని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి శత్రువులు ఎవరూ లేరని అందరు మిత్రులేనని అన్నారు.

సంక్షేమమే పరమావధి

పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు ప్రజా పాలన వచ్చిందని ప్రజా పాలన ఇక మొదలైందని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు దరఖాస్తుతో జత చేయాలని సూచించారు. లబ్ధి పొందడానికి మహాలక్ష్మి పథకం కింద ప్రతినెల మహిళలకు 2500 ఆర్థిక సాయం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పథకం కింద రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15000 అదే విధంగా వ్యవసాయ కూలీలకు ఏటా 12 వేల రూపాయలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం ఇల్లు లేని వారికి అర్హులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం, అదేవిధంగా అమరవీరుల మరియు ఉద్యమకారుల కోసం 250 గజాల ఇంటి స్థలం, గృహ జ్యోతి పథకం కింద పేద కుటుంబానికి ప్రతి నెల 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, చేయూత పథకం కింద 4000 రూపాయలు పింఛన్, దివ్యాంగులకు 6000 పింఛన్ పొందేందుకు పూర్తిస్థాయిలో ప్రజా పాలన దరఖాస్తులు రూపొందించబడ్డాయని పేర్కొన్నారు. దరఖాస్తు ప్రతులను ఎమ్మెల్యే శంకర్ మీడియాకు ప్రదర్శించారు.

తప్పులు జరిగితే క్షమించను..

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హెచ్చరిక

గ్రామాల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు.
ఈ సందర్భంగా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇతరత్రా విషయాల్లో కార్యకర్తలు నిఖార్సుగా ఉండాలని ఏలాంటి ఒడిదుడుకులకు పాల్పడవద్దని ఏదైనా తప్పు చేస్తే మీడియా నిర్మొహమాటంగా వెలుగులోకి తేవాలని నేను ఎవరిని ఉపేక్షించనని హెచ్చరించారు.
నియోజకవర్గంలో మీడియాకు వార్తలు, వాస్తవాలు రాయడానికి పూర్తి స్వేచ్ఛ తన ప్రభుత్వం కల్పిస్తుందని, నిజాలు నిర్భయంగా వెలికి తీయాలని అది మనవారైనా ఇతరులైన ఎవరికి భయపడాల్సిన ఖర్మ లేదని ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ పట్టణ అధ్యక్షుడు చెన్నయ్య మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సిద్ధార్థ, బసవమప్ప, సింగారం దర్శన్, జగదీశప్ప మురళీమోహన్ అప్పి, మంగమధు, శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు.. కేపీ