తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటన ఖరారైంది. తన స్వగ్రామానికి వెళ్లేందుకు బెంగుళూరు ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన చంద్రబాబు..
ఇక్కడ జరిగిన బెంగుళూరు టీడీపీ ఫోరం మీటింగ్‌లో పాల్గొన్నారు. నవశకం తెలుగువారి సొంతం కావాలని, నంబర్ వన్ గా తెలుగుజాతి ఉండాలనేదే తన విజన్ అని అన్నారు. గతంలో థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ లోకల్లీ అని ఉండేది.. కానీ ఇప్పుడు థింక్ గ్లోబల్లీ.. యాక్ట్ గ్లోబల్లీ అనేది తన కొత్త నినాదమని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు వద్ద చంద్రబాబుకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కెఎమ్ఎమ్ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆ తరువాత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు వారంటే గతంలో ఏపీకి మాత్రమే పరిమితం. కానీ నేడు తెలుగు వారు ఏపీ, తెలంగాణలోనే కాకుండా చెన్నై, బెంగళూరు ఇలా ఏ సిటీకి వెళ్లినా మన వాళ్ల ప్రతిభ కనిపిస్తోందన్నారు. ఇది ఎంతో గర్వ కారణం అని కీర్తించారు.
ప్రతి ముగ్గరు ఐటీ ప్రొఫెషనల్స్ లో ఒక తెలుగువాడు
మన దేశంలోనే కాదు.. ప్రపంచం మొత్తంలో తెలుగు వారు విస్తరిస్తున్నారు. ఏ దేశానికి వెళ్లినా ప్రముఖ స్థానాల్లో మన తెలుగు వారు ఉండటం సంతోషంగా ఉందన్నారు. నేను సీఎం అయిన తొలిరోజుల్లో ఒక కూలీ చేసుకునే వ్యక్తి తమ కొడుకుని ఐటీ ప్రొఫెషనల్ ఎందుకు చేయకూడదు అని ఆలోచించానన్నారు. అందుకే నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టానని తెలిపారు. నాడు తాను ఐటీనీ ప్రారంభించినప్పడు ఎగతాళి చేశారని.. గతంలో ఐటీ అంటే బెంగళూరు మాత్రమే ఉండేది.. కానీ బెంగళూరుతో పోటీపడి హైదరాబాద్ ఉండాలని, నాలెడ్జ్ ఎకానమీతో హైదరాబాద్‌ను ప్రపంచం పటంలో స్థానం కల్పించగలిగానన్నారు. ప్రతి ముగ్గురు ఐటీ ప్రొఫెషనల్ లో మన తెలుగువారు ఒకరున్నారన్నారు. ఫార్మారంగం, బయో టెక్నాలజీతో పాటు ఏ సెక్టార్ తీసుకున్నా నాలెడ్జ్ ఎకానమీకి ఇప్పుడు వెన్నుముకగా ఐటీ తయారైందని తెలిపారు.
2047 నాటికి ప్రపంచంలోనే అగ్రగామిగా మనదేశం
2047 నాటికి ప్రపంచానికే నాయకత్వం ఇచ్చేది మన భారతదేశమే అని జోస్యం చెప్పారు. తాను విజన్ 2020 అంటే ఆనాడు ఎగతాలి చేశారు.. నన్ను 420 అని కూడా విమర్శించారు. ఆ 2020 విజన్‌తో అసోషియేట్ అయిన వాళ్లు నేడు బ్రహ్మాండంగా ముందుకు వచ్చారు అని చెప్పారు. 2047 నాటికి ప్రపంచంలోనే భారతదేశం అగ్రదేశంగా, అభివృధ్ధి చెందిన దేశంగా నెంబర్ వన్ స్థాయిలో ఉంటుందని తెలిపారు. రాష్ట్రం కోసం నేను పోరాడతా.. కానీ దానికి మీ సహకారం కావాలని కోరారు. దేశానికి పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు వచ్చాక దశదిశ మారిందని.. ఐటీని ప్రొమోట్ చేయాలని పబ్లిక్ పాలసీ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.
తెలుగుజాతి రుణం తీర్చుకుంటా
బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులు నేటి నుండి వందరోజుల ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలని తెలిపారు. మీ భవిష్యత్తుతో పాటు ఏపీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యతను కూడా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికలొచ్చినప్పుడు ఊర్లకు ఎవరెళ్తారు అనుకోకుండా 10 రోజులు సెలవు పెట్టివెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని సూచించారు. తనకు పదవులు, డబ్బులు, లగ్జరీ జీవితం అవసరం లేదని తెలిపారు. తను ఏంచేశానో తర్వాత తరాలు గుర్తుంచుకోవాలనేదే తన లక్ష్యం అని అందుకోసమే పని చేస్తున్నా అన్నారు. మన మేథోసంపతితో తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలి. ప్రపంచమే హద్దుగా తెలుగుజాతి ఎదగాలి” అని చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు.