రాష్ట్రంలో గత నెలరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. విపరీతమైన ఉక్కపోతలు, వేడిగాలులతో ప్రజలు తీవ్రంగా అల్లాడిపోతున్నారు.
ఎండలో బయటికి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా రానున్న రోజులు ఇంకెలా ఉంటాయో అనే భయం ప్రజల్లో మొదలైంది. ఈ తరుణంలోనే వాతావరణశాఖ చల్లటి వార్త తెలిపింది. రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఉత్తర గుజరాత్ నుంచి మధ్య మహారాష్ట్ర వద్ద కేంద్రీకృతమైన ఆవర్తనం అంతర్గతం కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు గాలి విచ్ఛిన్నత సగటు సముత్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో వ్యాపిస్తుందని పేర్కొంది. మరోవైపు గంటకు 30 కి.మీ నుండి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో కింది స్థాయి గాలులు దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయని స్పష్టం చేసింది. మొన్నటి వరకు 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, గడిచిన రెండు రోజుల్లో మాత్రం ఉష్ణోత్రలు తగ్గుముఖం పట్టడంతో 40 డిగ్రీలుగా ననమోదైంది. ఇక రానున్న 5 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు కానున్నాయని తెలుస్తోంది.
కాగా, మార్చి మొదలు కాకముందే మొదలైన ఎండలు ఏప్రిల్ నెల వరకే 44 డిగ్రీల ఉష్ణోగ్రతతో దంచికొట్టడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అని భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే మే నెలలో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పలు కీలక హెచ్చరికలు కూడా జారీ చేసింది. మే నెలలో ఎండలతో పాటు వేడి గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. ఈ తరుణంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.