Precautions should be taken to prevent diseases transmitted from animals
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్
పెద్దపల్లి, జూలై -6: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధుల నివారణకు జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ అన్నారు.
శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలోని పశు వైద్యశాలలో నిర్వహించిన జంతువులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, జంతువుల నుండి మనుషులకు, మనుషుల నుండి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారని, ముఖ్యంగా జంతువుల నుండి సంక్రమించే వ్యాధులలో రేబిస్, క్షయ, బర్డ్ ఫ్లూ, ఆంత్రాక్స్, బ్రూసెల్లోసిస్ ఉన్నాయని అన్నారు.
జంతువుల నుండి మనుషులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధుల నివారణ కొరకు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, వ్యాధి బారిన పడ్డ పెంపుడు జంతువులను తాకిన వెంటనే చేతులను యాంటిసెప్టిక్ లోషన్లతో, సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలనితెలిపారు. చనిపోయిన జంతువులు, జీవాలు తీసుకెళ్ళేటప్పుడు వాటి స్రావాలు, చనిపోయిన పిండాలను చేతికి అంటకుండా తీసి వాటిని పూడ్చిపెట్టాలని తెలిపారు.
పెంపుడు కుక్కలకు తప్పనిసరిగా లెప్టోస్పైరోసిస్, యాంటి రేబీస్ టీకాలు వేయించాలని, పెంపుడు జంతువులు కరిచినప్పుడు త్వరగా వైద్యుని సంప్రదించి (టి.టి., యాంటి రేబీస్) టీకాలు వేయించు కోవాలని (రేబీస్ వ్యాధికి చికిత్స లేదు),
మరగ కాచిన పాలు, బాగా ఉడకబెట్టిన మాంసం ఆహారంగా తీసుకోవాలని, చవకబారు ఐస్క్రీములు తినకూడదని అన్నారు.
చనిపోయిన జంతువుల/ జీవాల మాంసం తినకూడదని, ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలతో చనిపోయిన పశువులు, జీవాల కళేబరాలను కోయకూడదని, వాటినిలోతైన గోతిలో సున్నము చల్లి పూడ్చి/ కాల్చి వేయాలని, శుభ్రమైన ఆహార నియమాలను పాటించాలని, తరచు పెంపుడు కుక్కల మలాన్ని పరీక్ష చేయించి, నట్టల నివారణకు నట్టల మందులను త్రాగించాలని, ఎలుకలను మన పరిసర ప్రాంతాలలో ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పశు సంవర్ధక శాఖ ఇన్చార్జి అధికారి డాక్టర్ రామస్వామి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కమలాకర్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ పి.మదూకర్ రెడ్డి, హెచ్.ఈ.ఓ. టీ. రాజేశం, ఎపిడమలాజిస్ట్ నరేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App