Trinethram News : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు వివరించింది. కేసు వివరాలు మీడియాతో మాట్లాడొద్దని, ర్యాలీలు, సభల్లో పాల్గొనవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై దళిత, పౌర సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఐదేళ్లుగా జైలులోనే ఉన్నాడు శ్రీనివాస్. విశాఖ సెంట్రల్ జైలులో ఆయన దీక్ష చేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తనకు న్యాయం చేయాలని కోరాడు. సీఎం జగన్ వచ్చి సాక్ష్యం చెప్పాలని అన్నాడు. శ్రీనివాస్‌కు మద్దతుగా ఆయన తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు కూడా ఇటీవల దీక్ష చేశారు.