Good news for farmers: Government made a key announcement
Trinethram News : తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతోంది. అప్పటి నుంచే పంట బీమా పథకాన్ని అమలు చెయ్యాలి అనుకుంటున్న ప్రభుత్వం.. అందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటోంది.
దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. బీమాను అమలుచేసే కంపెనీలను ఎంపిక చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశీలించి.. రైతులను పూర్తిగా ఆదుకునేలా బీమా కవరేజ్ ఉండేలా చెయ్యాలని మంత్రి సూచించారు. అలాగే.. ఖరీఫ్ సాగులో భూసార పెంపుకోసం పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై రైతులకు వెంటనే ఇవ్వాలని ఆదేశించారు.
ఈ పనిని టీఎస్ సీడ్స్ అధికారులకు అప్పగించారు. ఈమధ్య కురిసిన అకాల వర్షాల్లో పంట నష్టపోయిన రైతులకు మొదటి విడత పరిహారం 15 కోట్లు పంపిణీ పూర్తవ్వడంతో ఏప్రిల్ (రెండోవిడత), మే (మూడోవిడత)లో జరిగిన పంట నష్ట వివరాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భూసార పరీక్ష కోసం మట్టి నమూనాలు ఇచ్చే రైతులకు, వచ్చే నెలాఖరులోగా ఫలితాలు ఇచ్చేలా చెయ్యాలని కోరారు.
ఢిల్లీ చుట్టుపక్కల రైతులు పంటలను తగలబెట్టడం వల్ల అక్కడ వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. అలా తెలంగాణలో జరగకుండా.. రైతులు పంటలను తగలబెట్టకుండా.. వారికి తగిన అవగాహన కలిగించాలని, వినకపోతే, జరిమానాలు కూడా విధించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడును నెలాఖరులోగా కొనాలని అధికారులకు తెలిపారు.
ఉద్యానశాఖ అధ్వర్యంలో ప్రభుత్వం కేటాయించిన భూముల్లో మోడ్రన్ టెక్నాలజీతో పండ్లతోటల పెంపును ప్రోత్సహించాలని మంత్రి కోరారు. ఆయిల్ ఫాం కంపెనీల పనితీరు ఆధారంగా చర్యలు తీసుకోవాలనీ, మల్బరిసాగుకు అనుకూల ప్రాంతాల్ని ఎంపిక చేసి, పట్టు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
ఇప్పుడు రైతులు.. ఏప్రిల్‌లో జరిగిన పంట నష్టం పరిహారాన్ని ప్రభుత్వం నుంచి పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం వ్యవసాయ శాఖ అధికారులకు కాల్ చేసి.. ఎప్పుడు ఇస్తారో తెలుసుకోవచ్చు. తద్వారా త్వరగా పరిహారం పొంది.. ఖరీఫ్ సాగు చేపట్టేందుకు వీలవుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App