TRINETHRAM NEWS

గంటకు 9 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఫంగల్ తుపాను..

Trinethram News : అమరావతి : నైరుతి బంగాళాఖాతం(Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ (శుక్రవారం) తీవ్ర వాయుగుండంగానే కొనసాగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు..

గడిచిన 6 గంటల్లో గంటకు 9 కిలోమీటర్ల వేగంతో ఫెంగల్ తుపాను (Fengal Cyclone) కదులుతోందని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి ట్రింకోమలీకి 240 కి.మీ., నాగపట్నానికి 330 కి.మీ., పుదుచ్చేరికి 390 కి.మీ., చెన్నైకి 430 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమైందని కూర్మనాథ్ వెల్లడించారు.

శనివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరాల సమీపంలో కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గరలో తీరం దాటే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీని ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని కూర్మనాథ్ వెల్లడించారు. ఇతర జిల్లాల్లో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూర్మనాథ్ వెల్లడించారు.

కాగా, ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. చెన్నైలో నిన్న రాత్రి నుంచీ ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. చెంగల్ పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుత్తురై, తిరువారూర్ జిల్లాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. కడలూరు, నాగపట్నం తీరం అల్లకల్లోలంగా మారింది. పుదుచ్చేరి, కారైకల్, కడలూరులో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App