Trinethram News : ముంబయి: రుణమాఫీ ఆఫర్ల పేరుతో వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రకటనలు నమ్మి ప్రజలు మోసపోవద్దని భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) హెచ్చరించింది..
ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రుణాలు తీసుకుంటే అవి మాఫీ అవుతాయని ప్రచారం చేస్తూ కొన్ని సంస్థలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయి. ఈ ప్రకటనలు ఆర్‌బీఐ దృష్టికి రావడంతో.. వాటిని నమ్మొద్దని వినియోగదారులను హెచ్చరించింది..
”రుణమాఫీ ఆఫర్ల పేరుతో కొన్ని సంస్థలు వార్తా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. సర్వీస్/చట్టపరమైన రుసుము పేరుతో నగదు వసూలు చేసి రుణమాఫీ ధ్రువపత్రాలను జారీ చేస్తున్నాయి. ఇందుకు ఆయా సంస్థలకు ఎలాంటి అనుమతి లేదు. ఇలాంటి మోసపూరిత ప్రకటనలను కొందరు వ్యక్తులు, సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. దాంతోపాటు బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు రుణ మొత్తం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని వినియోగదారులకు చెబుతున్నాయి. ఇలాంటి ప్రచారం ఆర్థిక సంస్థల స్థిరత్వాన్ని, డిపాజిటర్ల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. అలాంటి సంస్థలతో సంబంధాలు కలిగి ఉండటం ఆర్థికపరమైన నష్టాలకు దారి తీస్తుంది. ఇలాంటి ప్రకటనలను వినియోగదారులు నమ్మొద్దు. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలి” అని ఆర్‌బీఐ ప్రకటనలో పేర్కొంది..