TRINETHRAM NEWS

ఏ.టి.సి కోర్సుల పై విస్తృత ప్రచారం కల్పించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

*పెద్దపల్లి, రామగుండం ఐటిఐ లలో ఏటిసి కేంద్రాల ఏర్పాటు

*ఒక్కో ఏటిసి కేంద్రంలో 6 కోర్సులలో 172 సీట్లు

*ఏటీసీ కోర్సుల అడ్మిషన్లకు అక్టోబర్ 30 గడువు

*అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాల పై పత్రిక సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, అక్టోబర్-18: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలో ఐటిఐ కేంద్రాల లో ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సుల ప్రవేశాలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాల పై పత్రిక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఐటిఐ కళాశాలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లను ప్రారంభించిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా హైదరాబాదులో ఒకేసారి 65 ఏటిసి కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని అన్నారు. మొదటి దశలో 25 ఏటీసీ కేంద్రాలలో ప్రభుత్వం అడ్మిషన్స్ ప్రారంభిస్తుందని, దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు వచ్చాయని అన్నారు.

మన జిల్లాలో ఉన్న ఐటిఐ రామగుండం, ఐటిఐ పెద్దపల్లిలో 2 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు కావడం జరిగిందని అన్నారు. మన జిల్లాలో ఉన్న 2 ఏ.టి.సి కేంద్రాలు మొదటి దశలో ఎంపిక కావడం జరిగిందని , ఒక్కో చోట 6 కోర్సులలో 172 సీట్లు అడ్మిషన్స్ ప్రారంభించడం జరిగిందని అన్నారు.

జిల్లాలోని ఏ.టి.సి లలో అడ్మిషన్స్ పొందేందుకు అక్టోబర్ 30, 2024 చివరి తేదీ అని తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఏ.టి.సీ కోర్సులు పొందేందుకు అర్హులని అన్నారు. ఈ కోర్సులతో మల్టి నేషనల్ కంపెనీలలో తప్పనిసరిగా ఉద్యోగం లభిస్తుందని అన్నారు.

మన జిల్లాలో ఒక సంవత్సరం కాలపరిమితి గల మ్యాను ఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మ్యాను ఫ్యాక్చరింగ్ టెక్నీషియన్, ఆర్టీసీ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ కోర్సులలో 40 సీట్లు ఉన్నాయని, రెండు సంవత్సరాల కాల పరిమితి గల బేసిక్ డిజైనర్ అండ్ పర్చుయల్ వెరిఫైర్(మెకానికల్), అడ్వాన్సుడ్ సి.ఎన్.సి మిషనింగ్ టెక్నీషియన్, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులలో 24 సీట్లు ఉన్నాయని తెలిపారు.

ప్రస్తుతం మార్కెట్ డిమాండ్ ప్రకారం టాటా కన్సల్టిస్ వారితో సమన్వయం చేసుకొని ఈ కోర్సులను డిజైన్ చేశామని అన్నారు. ఐటీఐ పెద్దపల్లి లోని ఏటిసి కేంద్రంలో 172 సీట్లకు 110 పైగా సీట్లు ఇప్పటి వరకు భర్తీ జరిగాయని, రామగుండం ఏటీసీ కేంద్రంలో 35 సీట్లు మాత్రమే నిండాయని, జిల్లాలో ఉన్న యువత యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోర్సులలో జాయిన్ కావాలని కలెక్టర్ కోరారు.

అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో కోర్సులలో జాయిన్ అయ్యేందుకు అడ్మిషన్ కోసం ఐటి .తెలంగాణ గవర్నమెంట్ .ఇన్ ఆన్ లైన్ పోర్టల్ లో దరఖాస్తు చేసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్లతో (పదవ తరగతి మెమో, బోనఫైడ్ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం, టిసి, ఆధార్ కార్డ్) పెద్దపల్లి ఐటిఐ కేంద్రంలో సంప్రదించాలని కోరారు.

అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ కోరారు. అభ్యర్థులు ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రంలో ప్రవేశాలకు కనీస వయసు 14 సంవత్సరాలు మాత్రమేనని అన్నారు.
ఏ.టి.సి కేంద్రం భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, కోర్సులకు సంబంధించి అవసరమైన పరికరాల సైతం జిల్లాకు చేరుకున్నాయని అన్నారు. సెలవు దినాలలో కూడా అడ్మిషన్స్ స్వీకరించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి అధికారి తిరుపతి, పెద్దపల్లి, రామగుండం ఐటిఐ ప్రిన్సిపాల్స్ , సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App