TRINETHRAM NEWS

పల్నాడు: దారులన్నీ ‘ప్రజాగళం సభ’ వైపే అనే మాదిరిగా పల్నాడు జిల్లా బొప్పూడిలో బహిరంగ సభకు తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు..
రాష్ట్ర నలుమూలల నుంచి బస్సులు, ట్రాక్టర్లు, కార్లు, ద్విచక్రవాహనాలపై ప్రజలు సందడిగా సభకు చేరుకున్నారు. మహిళలు సైతం భారీగా తరలివచ్చారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోతున్నాయి. 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం ఇప్పటికే కార్యకర్తలతో నిండిపోయింది. సభకు వచ్చే ప్రజలకు మార్గ మధ్యలోనే భోజనం, తాగునీటి వసతులు ఏర్పాటు చేశారు.

విజయవాడ, గుంటూరు, ఒంగోలు వైపు నుంచి వేల సంఖ్యలో వాహనాలు సభకు చేరుకుంటున్నాయి. ఆర్టీసీ పూర్తి స్థాయిలో బస్సులు ఇవ్వకపోవడంతో అందుబాటులో ఉన్న వాహనాల్లో స్వచ్ఛందంగా ప్రజలు తరలివస్తున్నారు. పదేళ్ల తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపైకి రానుండటంతో కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపైంది. బొప్పూడి ప్రజాగళం సభ చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

బొప్పూడిలో పండుగ వాతావరణం..

బొప్పూడి ప్రజాగళం ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. బొప్పూడికి ఇరువైపులా కిలోమీటర్ల పొడవునా తెదేపా, జనసేన, భాజపా జెండాలు రెపరెపలాడుతున్నాయి. ప్రజాగళం సభకు చేరుకునేందుకు వేలాది వాహనాలు ఒకేసారి మంగళగిరి టోల్‌ గేట్‌ వద్దకు చేరుకోవడంతో నిర్వాహకులు కాసేపు టోల్‌ గేట్లు ఎత్తేశారు. చిలకలూరిపేట నుంచి బొప్పూడి సభా వేదిక వరకు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది.