నేటి నుంచి ఐదురోజుల పాటు ఆకాశంలో అద్భుతం
ఉల్కాపాతాలను నేరుగా చూడొచ్చు
హైదరాబాద్: ఆకాశం నుంచి భూమిపైకి రాలే ఉల్కాపాతాలను ప్రజలంతా నేరుగా చూడొచ్చని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ సంచాలకులు శ్రీరఘునందన్ కుమార్ తెలిపారు. డిసెంబరు 16 నుంచి 20 వరకూ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున ఐదు గంటల వరకూ వేర్వేరు సమయాల్లో కాంతివంతమైన ఉల్కాపాతాలు కనిపిస్తాయని పేర్కొన్నారు.
పాథియాన్ అనే గ్రహశకలం సూర్యుడి చుట్టూ తిరిగే క్రమంలో కొద్దినెలల క్రితం భూకక్ష్యలోకి ప్రవేశించింది. ఇది కొన్ని పదార్థాలతో కలిసి రాపిడికి గురై చిన్న చిన్న ఉల్కలుగా రాలిపడుతుంది. ఈ క్రమంలో ఇవి గంటకు 150 కాంతి పుంజాలను వెదజల్లుతాయని అంతర్జాతీయ ఉల్కాపాత సంస్థ(ఐఎంఓ) వెబ్‌సైట్‌లో తెలిపింది.
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ ఈ ఉల్కాపాతాలు ప్రకాశవంతంగా కనిపిస్తాయని, వాటిని చూసిన వారు ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి ఐఎంఓ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయవచ్చని పేర్కొంది.