Trinethram News : హైదరాబాద్
ధరణి పోర్టల్ పునర్నిర్మాణం, సమస్యల పరిష్కారానికి సిఫార్సులు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తొలిసారి జిల్లా కలెక్టర్లతో సమావేశం కానుంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో అయిదు జిల్లాల కలెక్టర్లతో సభ్యులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ధరణి పోర్టల్ నిర్వహణ, భూ విచారణలకు సంబంధించి తహసీల్దార్లు ఆర్డీవోల పాత్ర, సమస్యలను పరిష్కరించేందుకు పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఐచ్ఛికాలు, వాటి పనితీరుపై సిద్దిపేట, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు వివరించనున్నారు. ధరణి సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను అనుసరించి గ్రామీణం, అటవీ- రెవెన్యూ సరిహద్దు, సర్వే తదితర రకాల సమస్యలు ఉండే జిల్లాలను రెవెన్యూశాఖ ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈ సమావేశానికి తగిన సమాచారంతో హాజరుకావాలంటూ మంగళవారం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్.. జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపారు. మొత్తం 7 అంశాలపై సమగ్రంగా సమావేశంలో చర్చించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో గతంలో నిర్వహించిన భూభారతి సర్వే ప్రాజెక్టు అంశం కూడా చర్చించాల్సిన వాటిల్లో ఉంది. ధరణి పోర్టల్ సాఫ్ట్‌వేర్ నిర్వహణ సంస్థ ప్రతినిధులను భేటీకి హాజరవ్వాలని రెవెన్యూశాఖ ఆహ్వానించింది.