TRINETHRAM NEWS

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 23 – 01 – 2024,
వారం … భౌమవాసరే ( మంగళవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
ఉత్తరాయణం – హేమంత ఋతువు,
పుష్య మాసం – శుక్ల పక్షం,

తిథి : త్రయోదశి రా8.57 వరకు,
నక్షత్రం : ఆర్ద్ర పూర్తి
యోగం : ఐంద్రం ఉ9.15 వరకు,
కరణం : కౌలువ ఉ8.54 వరకు,
తదుపరి తైతుల రా8.57 వరకు,

వర్జ్యం : మ2.49 – 4.19,
దుర్ముహూర్తము : ఉ8.51 – 9.36 &
రా10.54 – 11.46,
అమృతకాలం : రా8.27 – 10.06,
రాహుకాలం : మ3.00 – 4.30,
యమగండo : ఉ9.00 – 10.30,
సూర్యరాశి : మకరం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 6.38,
సూర్యాస్తమయం: 5.46,

          నేటి మాట

భక్తుడు ముక్తి పొందాలని అంటే – మార్గం సాధన కదా!! – అది ఎలా వుండాలి???

మానవ జన్మ విత్తనం వంటిది, విత్తనానికి పూర్వం చెట్టు ఉంది, విత్తనం తరువాత కూడా చెట్టు ఉండొచ్చు!అయితే విత్తనము తరువాత చెట్టు ఉండాలా లేదా అనేది విత్తనం సామర్ధ్యం మీదా అధారపడి ఉంటుంది.

విత్తనములో మొలకెత్తే గుణం ఉన్నట్లయినా అది మొక్కగా మారి పెద్ద వృక్షం అవుతుంది.
మళ్ళీ విత్తనాలు పుట్టి మళ్ళీ చెట్లు.ఇలా విత్తనం, చెట్టు తిరుగుతూ ఉంటాయి.

మన జన్మలు కూడా ఇంతే! గత జన్మలో ఉన్నాం. ఇప్పుడు కూడా ఉన్నాం.
ఇక ముందు కూడా ఉండవచ్చు.అయితే ఇక ముందు జన్మ ఉండాలా, లేదా అనేది నేటి మన సాధన మీద ఆధారపడి ఉంది!

విత్తనంలో మొలకెత్తే గుణం ఉన్నంత వరకూ అది మొలకెత్తుతునే ఉంటుంది. ఆ మొలకెత్తే గుణం లేకపోతే ఎంత మట్టి వేసినా, ఎన్ని నీళ్ళు పోసినా మొలకెత్తదు. అలానే మనలో ఉండే అజ్ఞాన, అహంకార, మమకారాలు ఉన్నంత వరకూ చావు పుట్టుకల చక్రంలో తిరుగుతూనే ఉంటాం.

మనలో ఇవి ఎప్పుడైతే నశించుకుపోతాయో అప్పుడు సహజముగానే పునర్జన్మ నుండి విముక్తులం అవుతాం. అయితే వీటిని వదలడం అంత సులువైన పని కాదు! అలా అని కష్టమూ కాదు!…

నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉంటే మనసులో ఒక విధమైన కంపనం కలిగి అజ్ఞాన, అహంకార మమకారాలు క్రమేపీ తగ్గుముఖం పడతాయి. అలా నిరంతరం చేస్తూ చేస్తూ ఉంటే ఏదో ఒక సమయంలో ఆయా గుణాలు పూర్తిగా నశించుకుపోతాయి.

ఇక ముక్తికి మార్గం దొరికినట్లే! అయితే అంతవరకు గట్టి సాధనే చేయాలి!!.ఎన్ని ఆటంకాలు వచ్చినా మద్యలో ఆపడానికి వీల్లేదు.

మరొక ఆలోచన లేకుండా భగవంతుని ప్రేమించు. ఆయన లేనిదే దేనికీ విలువలేదు అని నమ్ము , ఆయనే సర్వస్వము అని గాఢ విశ్వాసము కలిగియుండు.
అప్పుడు నీవు భగవంతునివాడవు అగుదువు, భగవంతుడు నీవాడగును. అంతకన్న ఆప్యాయత వేరులేదు. ఎంతమందో వంటింటిలో తిరుగవచ్చు, భోజనశాలలో ఎదురుచూడవచ్చు.
కానీ నీవు ఆ యజమాని కుమారుడవైన, నీకే ముందు వడ్డింతురు.
వడ్డించేవాడు మనవాడయిన కడపంక్తినైనా కూర్చొనవచ్చును కదా!

           శుభమస్తు

సమస్త లోకా సుఖినోభవంతు