తెలంగాణలో భారీ పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి
రూ.1000 కోట్లతో కెమికల్ ప్లాంట్
రూ.270 కోట్లతో ఖమ్మంలో పామాయిల్ సీడ్ గార్డెన్
దావోస్‌లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్‌తో కీలకమైన సమావేశం జరిగింది. తెలంగాణలో అపారమైన అవకాశాలున్నాయని, వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్ కంపెనీ ఆసక్తిని ప్రదర్శించింది. వ్యూహత్మకమైన పెట్టుబడులతో తెలంగాణ అడుగు పెట్టాలని చూస్తున్నామని నాదిర్ గోద్రెజ్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పామ్ ఆయిల్ మిషన్‌ను నడపడంలో గోద్రెజ్ ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నది. ఖమ్మం జిల్లాలో మొదటి దశలో రూ. 270 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తోంది. మలేషియాకు చెందిన అతి పెద్ద పామాయిల్ కంపెనీ సిమ్ డార్బీ తో గోద్రెజ్ జాయింట్ వెంచర్ కుదుర్చుకుంది.
ఈ రెండు కంపెనీల జాయింట్ వెంచర్ గా దేశంలోనే మొట్టమొదటి ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ వాణిజ్య యూనిట్ ను ఖమ్మంలో ఏర్పాటు చేస్తోంది. నాణ్యమైన పామాయిల్ విత్తనాలను నూటికి నూరు శాతం ప్రస్తుతం దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని అధిగమించి దేశీయ విత్తనాల ఉత్పత్తి, , ఏడాదికి 70 లక్షల మొక్కలను పెంచాలనేది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఎంచుకుంది. దీంతో దాదాపు పది లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు అవుతుంది.
ఈ సందర్భంగా తెలంగాణలో 1000 కోట్ల కెమికల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు గోద్రెజ్ అంగీకరించింది. దీంతో పాటు స్కిల్ డెవెలప్ మెంట్, రియల్ ఎస్టేట్, క్రీమ్‌లైన్ డెయిరీ తదితర రంగాలలో పెట్టుబడుల్లో పెట్టేందుకు అనువైన అంశాలపై చర్చించారు. తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన గోద్రెజ్ ప్రతినిధులకు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పెట్టుబడులకు తెలంగాణ మొదటి గమ్యస్థానంగా మారిందని, దీంతో రాష్ట వ్యాపార, పారిశ్రామిక వృద్ధి పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ సమావేశానికి పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ స్పెషల్ సెక్రెటరీ విష్ణు వర్ధన్ రెడ్డి హాజరయ్యారు.