TRINETHRAM NEWS

Trinethram News : విశాఖపట్నంలోని బీచ్ ప్రాంతానికి.. “రామకృష్ణ బీచ్” అని పేరు పెట్టడం వెనుక కారణం, ఆ స్థలానికి దగ్గరలో రామకృష్ణ పరమహంస మఠం ఉండడం. ఇప్పటికీ మీరు గమనిస్తే, బీచ్ బస్ స్టాపుకి ఎదురుగా, రామకృష్ణ మిషన్ వారి గ్రంథాలయం ఉంటుంది.
ఈ గ్రంథాలయములోనే ఎగ్జిబిషన్ కేంద్రం కూడా ఉంటుంది. ఈ కేంద్రంలో రామకృష్ణ పరమహంస, శారదా దేవి, వివేకానంద.. వీరి జీవిత విశేషాలకు సంబంధించిన తైల వర్ణ చిత్రాలు అగుపిస్తాయి. ఈ గ్రంథాలయంలోకి ప్రవేశం ఉచితం. ఎవరైనా వెళ్లి పుస్తకాలు చదువుకోవచ్చు.
ఈ గ్రంథాలయం పక్కనే, రామకృష్ణ మిషన్ వారి నేచురోపతి కేంద్రం ఉంటుంది. వారంలో రెండు రోజులు ఇక్కడ రోగులకు ఉచిత కన్సల్టేషన్ ఇవ్వడంతో పాటు, ఉచిత ఔషధాలు కూడా పంపిణీ చేస్తారు. ఈ కేంద్రంలో యోగా, మెడిటేషన్ లాంటి అంశాలలో శిక్షణ కూడా ఇస్తారు.
ప్రస్తుతము, రామకృష్ణ బీచ్ ప్రాంతాన్ని “వరుణ్ బీచ్” అని కూడా కొందరు పిలుస్తున్నారు. దీనికి కారణం “వరుణ్ మోటార్స్” వారు ఇక్కడ పిల్లల పార్కును డెవలప్ చేశారు. ఈ పార్కు ఎదురుగా.. కొద్ధి దూరం వెళితే నోవాటేల్ హోటల్ ఉంటుంది. ఆ హోటల్ పక్కనే ఉండే ఐనాక్స్ మల్టీప్లెక్స్ కూడా ప్రస్తుతం “వరుణ్ బీచ్ ఐనాక్స్” పేరుతోనే పిలవబడుతోంది.

రామకృష్ణ పరమహంస ఆరాధించే కాళీకా దేవికి ఈ తీరంలోనే ఒక అతి పెద్ద ఆలయం నిర్మించడం మరో ఎత్తు. బీచ్ సందర్శనకు వచ్చేవారు.. ఈ కాళీ మందిర్ కూడా సందర్శిస్తారు.

రామకృష్ణ బీచ్ ప్రాంతంలో అన్ని వర్గాలకు పెద్ద పీట వేస్తూ, విగ్రహాలను ప్రతిష్టించారు. ఒక చోట మీకు వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహం కనిపిస్తే.. మరో వైపు మీకు నాస్తికవాది పెరియార్ రామస్వామి విగ్రహం కనిపిస్తుంది. ఒకవైపు భగత్ సింగ్, అల్లూరి, కోడి రామమూర్తి లాంటి వారి విగ్రహాలు కనిపిస్తే.. మరో వైపు గురజాడ, శ్రీశ్రీ, ఆరుద్ర మొదలైన కవుల విగ్రహాలు కనిపిస్తాయి.
సబ్ మెరైన్ మ్యూజియం, మత్స్యదర్శిని, ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, విశాఖ మ్యూజియం, టెలీస్కోప్ కేంద్రం మొదలైనవి ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలు. కొంచెం ముందుకు వెళితే ఉడా పార్క్ కూడా కనిపిస్తుంది. అది కూడా సందర్శించదగ్గ స్ధలమే.